ప్రభుత్వ మీటింగ్ కి బీజేపీ కార్యకర్తలను తరలించారని, తాను ప్రభుత్వం తరుపున మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముగ్గురు కేంద్ర మంత్రుల సాక్షిగా బీజేపీ కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించి తెలంగాణ ప్రతిష్టను మంటగలిపారన్నారు. నీచమైన కేంద్ర బీజేపీలో నాకు కనిపించిన ఏకైక మంచి మనిషి నితిన్ గడ్కరీ అన్నారు. రహదారుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని గడ్కరీ లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం తరుపున రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా తాను వెళ్ళానన్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో వివిధ రహదారుల శంకుస్తాపన కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బిజెపి నేతలు వ్యవహరించిన తీరుపై ఆ తర్వాత మంత్రుల నివాస సముదాయంలోని ఆయన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ పురోగమిస్తున్న రాష్ట్రం అని నితిన్ గడ్కరీ ఆయన ప్రసంగంలో కూడా అన్నారని మంత్రి వేముల పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అని నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మాకు చెప్పారని, ఒక్కో కార్పొరేటర్ కు వెయ్యి మందిని తీసుకోని రావాలని బీజేపీ భాద్యతలు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. బీజేపీ కండువాలు వేసుకుని ప్రభుత్వ కార్యక్రమంలో 3వేల మంది ఉన్నారని, తాను స్పీచ్ స్టార్ట్ చేయగానే కాషాయ కండువా వేసుకున్న బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని విమర్శించారు. నేను మాట్లాడితే అంత ఉలికిపాటు ఎందుకు? 8వేల కోట్లు గిఫ్ట్ గా ఇస్తున్నాం అనడం మంచిది కాదన్నారు.
అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణకు ఇచ్చిందని, ప్రభుత్వ ప్రోగ్రాం ను బిజెపి పార్టీ కార్యక్రమం లాగా చేశారని విమర్శించారు. బీజేపీ ఏమైనా చెప్పాలనుకుంటే 1లక్ష మందితో సభ పెట్టుకోని చెప్పుకుంటే ఏమేమైనా అడుగుతామా? అన్నారు. నా స్పీచ్ ను అడ్డుకోవాలని ముందే అనుకుని నినాదాలు ఇచ్చారన్నారు. పెద్దగా ఇచ్చింది ఏముంది …ఏడేళ్ల కాలంలో 7లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది ఎంత? 8వేల కోట్లకు ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా? నన్ను ఆపినంత మాత్రాన నిజాలు ఆగకుండా ఉంటాయా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అడుగుతానని భయంతో నా స్పీచ్ ను అడ్డుకున్నారని మంత్రి వెల్లడించారు. బీజేపీ కార్యకర్తలు బజారు రౌడీలా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలు చేసిన చిల్లర వ్యవహారానికి కేంద్రమంత్రి నాకు క్షమాపణ చెప్పారన్నారు. మేము బీజేపీ కార్యకర్తల్లాగా చేస్తే వాళ్ళు ఉంటారా అని మంత్రి వేముల ప్రశ్నించారు.
Also Read : కేటియార్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం