Mumbai another loss: ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తొమ్మిదో ఓటమి చవి చూసింది. వరుసగా ఎనిమిది ఓటమిల తర్వాత రెండు విజయాలు సాధించిన ఆ జట్టు నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 52 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోల్ కతా విసిరిన 166 పరుగుల విజయ లక్ష్యం సాధించలేక 17.3 ఓవర్లలో 113 పరుగులకే చాప చుట్టేసింది.
నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించి 5.4 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది, 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ తొలి వికెట్ గా ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ అజింక్య రెహానే (25) కూడా వెనుదిరిగాడు. నితీష్ రానా ఈ మ్యాచ్ లో కూడా సత్తా చాటి 26 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్సర్లతో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(6); ఆండ్రీ రస్సెల్ (9); షెల్డాన్ జాక్సన్ (5) విఫలమయ్యారు. రింకూ సింగ్ 23 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివర్లో ముగ్గురు బ్యాట్స్ మెన్ కమ్మిన్స్, సునీల్ నరేన్, టిమ్ సౌతీ డకౌట్ గా వెనుదిరిగారు. ముంబై బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో రాణించగా, కుమార్ కార్తికేయ సింగ్ రెండు; మురుగన్ అశ్విన్, డానియెల్ శామ్స్ చెరో వికెట్ పడగొట్టారు. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
ముంబై 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులు మాత్రమే చేసి మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. 32 వద్ద రెండో వికెట్ (తిలక్ వర్మ-6); 69 వద్ద మూడో వికెట్ (రమన్ దీప్ సింగ్-12) కోల్పోయింది. జట్టులో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్కడే రాణించి 51 పరుగులు చేసి ఔటయ్యాడు. టిమ్ డేవిడ్-13; పోల్లార్డ్-15 పరుగులు చేశారు. ముంబై మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయ్యింది. కోల్ కతా బౌలర్లలో కమ్మిన్స్ మూడు; ఆండ్రీ రస్సెల్ రెండు; టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.
ఐదు వికెట్లతో రాణించిన ముంబై బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read : చెన్నై దెబ్బకు ఢిల్లీ విలవిల