AP-UP: రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇక్కడ కూడా యోగీ లాంటి వ్యక్తీ సిఎంగా ఉండాలని, తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రభుత్వం రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అందుకే తాము కుటుంబ పార్టీలను, అవినీతి పార్టీలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధ్యమని, అందుకే ప్రజల మద్దతుతో 2024 లో రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఓ మతానికే కొమ్ముకాస్తూ హిందూమతంలో దాడులు చేస్తోందని ఆరోపించారు. బిజెపి చాలా అంశాల్లో ఎదురొడ్డి పోరాడిందని, జిన్నా టవర్, టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు, రామతీర్థం ఘటన లాంటి అంశాల్లో ఆందోళనలు చేశామన్నారు. కర్నూలు జిల్లా బీజేపీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి వీర్రాజు పాల్గొన్నారు. అనతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో జరుగుతోన్న సంఘటనలు దురదృష్టకరమని, వైద్య సిబ్బందికి సిఎం జగన్, వైద్య మంత్రి పట్ల ఎలాంటి భయం లేదని సోము విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. హిందూపురం జిల్లాలో ఓ బి ఫార్మసీ విద్యార్ధినిని లవ్ జిహాదీ పేరుతో వేధిస్తే ఆ యువకుడు ముస్లిం కాబట్టి కేసు పెట్టలేదన్నారు.
ఈ ప్రభుత్వంలో గానీ, గత ప్రభుత్వంలో గానీ హోం మంత్రులకు కనీసం ఒక డిఎస్పీని ట్రాన్స్ ఫర్ చేసే అధికారం కూడా లేదన్నారు, హోం శాఖ మంత్రి చేయాల్సిన పనులన్నీ ఎవరు చేస్తున్నారో అందరకీ తెలుసన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకంటే మోడీ అమలు చేస్తున్న పథకాలే ఎక్కువ ఉన్నాయన్నారు.
దేశంలో చాలా రాష్ట్రాల్లో ఒకట్రెండు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పోరాటం చేసి విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేశామని, అదే కోవలో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమేనని వీర్రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. కనీసం త్రిపురలో టిజి వెంకటేష్ లాంటి బలమైన వ్యక్తులు కూడా లేకుండానే గెలిచామని వ్యాఖ్యానించారు. తాము జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసే పోటీ చేస్తామని సోము స్పష్టం చేశారు. త్యాగం చేస్తానని చెప్పిన వ్యక్తీ ఏ పార్టీ గురించి అయినా చెప్పరా అని ప్రశ్నించారు. లేదా పవన్ చెప్పిన రోడ్ మ్యాప్ లో టిడిపి గురించి ప్రస్తావించారా అని సోము ప్రశ్నించారు.
ఈ కార్యక్రమాల్లో సోము వెంట బిజెపి ఎంపీ టిజి వెంకటేష్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : మీ త్యాగాలు మేం భరించలేం: సోము