No Power Holiday : పవర్ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖచిత్రం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎండాకాలంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో పరిశ్రమల గేట్లకు తాళాలు వేలాడగా, ఇప్పుడు ఏ పారిశ్రామికవాడ చూసినా కార్మికులతో కళకళలాడుతున్నది. ఇతర రాష్ర్టాల్లో పవర్ హాలిడేలు ఉండటంతో, అక్కడ పనిచేసే కార్మికులు సైతం పని కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. పొరుగు రాష్ర్టాలకు చెందిన కొందరు ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్ పనులు ఇక్కడ చేయించుకొని తీసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్రంలోని పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పరిశ్రమ వర్గాల పరిస్థితి ‘చేసుకున్నోళ్లకు చేసుకున్నంత పని’ అనేలా తయారైంది. రాష్ట్రంలో 138 పారిశ్రామికవాడలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ చుట్టూ 50కిపైగా ఉండగా, వీటిల్లో 40 వేలకు పైచిలుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఉన్నాయి. బాలానగర్, జీడిమెట్ల, చర్లపల్లి, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చింతల్ తదితర పారిశ్రామికవాడల్లో ప్లాస్టిక్, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, వివిధ రకాల ఔషధాలు, ఎలక్ట్రికల్.. రకరకాల కంపెనీలు కొలువుదీరాయి. ఇందులో 10-50 మంది పనిచేసే కంపెనీలే ఎక్కువ. ఈ కంపెనీలకు చేతినిండా ఆర్డర్లు ఉండటంతో రెండు షిఫ్టులు, అవసరమైతే అదనపు సిబ్బందితో మూడు షిఫ్టులు నడుపుతున్నాయి.
కరెంటు సమస్యతో మూతపడ్డ కంపెనీ లేదు
——————————–
రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతిరోజూ పీక్ అవర్స్‌లో.. అంటే ఉదయం 6 నుంచి 9, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు పవర్‌కట్స్ ఉండేవి. మిగిలిన సమయాల్లో సైతం లో వోల్టేజీ సమస్య ఉండేది. దీంతో బ్యాంకు రుణ వాయిదాలు చెల్లించలేక దివాళా తీసిన పరిశ్రమలు కోకొల్లలు. చాలా పరిశ్రమలు మూతపడగా, మరికొన్ని అందినకాడికి అమ్ముకొని వెళ్లిపోయాయి. తెలంగాణ వచ్చాక పరిశ్రమవర్గాలు అత్యంత భరోసాతో ముందుకు సాగుతున్నాయి. విద్యుత్తు సమస్య కారణంగా మూతపడ్డ కంపెనీ కానీ, నష్టపోయిన వ్యాపారి కానీ లేరంటే అతిశయోక్తి కాదు.
మూడు షిఫ్టులు ఆగకుండా పని
—————————-
మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాలకు గ్రానైట్ సరఫరా చేస్తాం. తెలంగాణ వచ్చాక ఒక్క రోజు కూడా ఆగకుండా మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి జరుగుతున్నది. ఇతర రాష్ర్టాల్లో పవర్ హాలిడేల వల్ల కంపెనీలు సరిగా నడవకపోవటంతో వారు కూడా హైదరాబాద్ వస్తున్నారు. మేం అత్యాధునిక మెషీన్లు వాడుతున్నాం. లో వోల్టేజీ లేకుండా నాణ్యమైన కరెంటు వస్తున్నది. దీంతో మిషన్లు కూడా రిపేర్లు లేకుండా నడుస్తుండటంతో నిర్వహణ ఖర్చులు తగ్గాయి.
– గణేశ్, శ్రీకృష్ణ గ్రానైట్స్ నిర్వాహకుడు, చర్లపల్లి
పరిశ్రమలకు జరిగిన మేలు మాటల్లో చెప్పలేనిది
————————————
గతంలో విద్యుత్తు సమస్యలతో రైతులు నష్టపోయి ఆత్మహత్య చేసుకొనేవారు. పారిశ్రామికవేత్తలు దివాళా ప్రకటించేవారు. పరిశ్రమలకు ప్రధానంగా కావాల్సింది.. విద్యుత్తే. గతంలో ఈ సమస్య వల్ల ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రోడ్డున పడ్డారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో విద్యుత్తు సమస్య అనేది లేకుండా పోయింది. దీంతో చేతి నిండా పని దొరుకుతుందన్న భరోసాతో ఇతర రాష్ర్టాల లేబర్స్ ఇక్కడికి వలస వస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాతో జరిగిన మేలు మాటల్లో చెప్పలేనిది. ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ మేలును మర్చిపోడు. సీఎం కేసీఆర్‌కు పారిశ్రామికవర్గాలు ఎంతో రుణపడి ఉంటాయి.
– గోపాల్‌రావు, రాష్ట్ర పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రధాన కార్యదర్శి
తెలంగాణ వచ్చాకే లాభాలు చూస్తున్నాం
——————————
గతంలో ఉత్పత్తి చేయలేక ఆర్డర్లను వదులుకొని బాధపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా తొలగిపోయింది. సీఎం కేసీఆర్ ఉన్నంతవరకు మనకు పవర్‌కట్‌లు ఉండవనే భరోసా ఉన్నది.
– ఏ శేషు రెడ్డి, అను మెటల్ క్రాఫ్ట్స్ , చర్లపల్లి
జనరేటర్ అవసరం లేకుండా పోయింది
———————————
పదిహేనేండ్లుగా ఆయుర్వేద ఔషధాల తయారీ యూనిట్‌ను నడుపుతు న్నాం. మాకు ఆరేడేండ్లుగా ఎటువంటి కరెంటు సమస్య లేదు. గతంలో వేసవికాలంలో జనరేటర్ వాడేవాళ్లం. ఇప్పుడు దానితో పనిలేకపోవటంతో ఏపీలో యూనిట్ నడుపుతున్న మా మిత్రుడికి ఇచ్చాం. సీఎం కేసీఆర్ ప్రగతిశీల ఆలోచనలు, ముందుచూపునకు కోతల్లేని విద్యుత్తే నిదర్శనం.
– సునీల్, ఫోర్-ఎస్ ల్యాబ్ సహ వ్యవస్థాపకుడు, చర్లపల్లి
యూపీలో జనరేటర్లు లేని కంపెనీ లేదు
——————————–
మాది ఉత్తరప్రదేశ్. చర్లపల్లిలో ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ నడుపుతున్నాను. యూపీలో మా మిత్రులు ఇదే పనిలో ఉన్నారు. జనరేటర్ లేకుండా వారి కంపెనీ ఒక్క రోజు కూడా నడవదు. తెలంగాణలో కరెంటు సరఫరా గురించి వారు ఎంతో గొప్పగా చెప్తారు.
– లాల్ చంద్ యాదవ్, హరి ఓమ్ ఇంజినీరింగ్ వర్క్స్ యజమానిపరిశ్రమలకు-పవర్ఫుల్
Also Read : గుజరాత్‌లో పవర్‌హాలిడే మంత్రి కేటీఆర్ ఎద్దేవా