భారత – పాకిస్తాన్ సంబంధాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో పాలకులే భారతదేశాన్ని విమర్శిస్తారని, ప్రజలు భారతీయుల్ని అభిమానిస్తారని శరద్ పవర్ చెప్పారు. పూణేలో గురువారం ఈద్ మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న పవార్ గతంలో కేంద్రమంత్రి హోదాలో పాక్ పర్యటనలో తన అనుభవాల్ని పంచుకున్నారు. కేంద్రమంత్రిగా ఉన్నపుడు క్రికెట్ టీమ్ తో తను కూడా కరాచి మ్యాచ్ చూసేందుకు వెళ్లానని, ఆ సమయంలో పాకిస్తానీల ఆదరాభిమానాలు మరువలేనివని గుర్తుచేసుకున్నారు.
కరాచీ క్రికెట్ మ్యాచ్ పూర్తి కాగానే క్రీడాకారులు స్థానికంగా పర్యాటక ప్రదేశాలు చూద్దాం అంటే కరాచిలో వివిధ ప్రాంతాలకు వెళ్లామని, ఆ సమయంలో అడుగడుగునా ప్రజల ప్రేమపూర్వక పలకరింపులు ముగ్ధుణ్ణి చేశాయని శరద్ పవార్ వెల్లడించారు. ఒక హోటల్ లో భారత బృందం దగ్గర బిల్లు కూడా తీసుకోలేదని, భారత్ నుంచి వచ్చిన మీరు అతిథులని బిల్లు తీసుకోకుండా..సుతారంగా తిరస్కరించారని చెప్పారు. పాక్ ప్రజలు భారత్ ను అమితంగా అభిమానిస్తారని, అధికారం కోసం పాలకులే ద్వేషిస్తారన్నారు.
అధికారంలో కొనసాగేందుకు మిలిటరీ సహాయంతో కొందరు పాక్ పాలకులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచి పోషిస్తున్నారని, వారి వల్లే రెండు దేశాల ప్రజల మధ్య విద్వేషాలు నెలకొన్నాయని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే శరద్ పవార్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పాలకులను ఉద్దేశించి చేసినా… నర్మగర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా ఉన్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిత్యం పాకిస్తాన్ మీద దుమ్మెత్తి పోయటం తప్పితే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు కృషి చేయటం లేదని అంతర్లీనంగా వ్యాఖ్యానించినట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.