ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు భారత దేశం చూపిస్తున్న చొరవ అభినందనీయమని శ్రీలంక నూతన ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విక్రమసింఘె కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘెను ఈ రోజు కలిసిన భారత రాయబారి గోపాల్ బాగ్లే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలపై భారత రాయబారితో విక్రమసింఘె చర్చించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, హిందూ మహా సముద్రంలో ఇది అత్యవసరమని విక్రమసింఘె అభిప్రాయపడ్డారు.
ఆరవ సారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విక్రమసింఘె ఆర్ధిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే గురుతరమైన బాధ్యత తీసుకున్నారు. యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన విక్రమసింఘెకు భారత మిత్రుడిగా పేరు ఉంది. విక్రమసింఘె పార్టీకి పార్లమెంటులో ఒకే సీటు ఉన్న ప్రధానమంత్రి పదవి దక్కటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో LTTEతో జరిగిన శాతి చర్చల్లో విక్రమసింఘె విధానాలపై తమిళులు కూడా హర్షం వ్యక్తం చేశారు. సిలోన్ లో శాంతి నెలకొనేందుకు అన్ని వర్గాలను, జాతులను కలుపుకుంటేనే సాధ్యం అవుతుందని తమిళ టైగర్లతో చర్చల సమయంలో విక్రమసింఘె విస్పష్ట ప్రకటన చేయటం అప్పట్లో శ్రీలంకలో సంచలనమైంది.
Also Read : మహింద రాజపక్స రాజీనామా