భారీ వర్షాలతో అస్సాం రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. బ్రహ్మపుత్ర నది తీరాన్ని వరదలు ముంచ్చెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 2 లక్షలమందిపై వరద ప్రభావం ఉంది. అస్సాం విపత్తు నిర్వహణ ప్రాథికార సంస్థ నివేదిక ప్రకారం ఒక్క కచర్ జిల్లాలోనే 51,357మంది ప్రభావితమయ్యారు. 652 గ్రామాల్లోని 16,645.61 హెక్టార్ల పంటభూమి నీటమునిగింది. అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందల గ్రామాలు అంధకారంలోకి జారుకున్నాయి.
జోర్హాట్ జిల్లాలోని నీమటిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. నగౌన్ జిల్లాలో వరదలు ముంచ్చెత్తడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. న్యూ కుంజుంగ్, ఫైంపూ, మౌల్హో, నమజురాంగ్, దక్షిణ బగెతార్, మహదేవ్ తిల్లా, కలిబారి, ఉత్తర బగెతార్, జియాన్, లోడి పంగమౌల్ గ్రామాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోనూ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో.. గడిచిన మూడు రోజుల్లో 10మంది ప్రాణాలు కోల్పోయారు. కచర్ జిల్లాలో సోమవారం ఇద్దరు మరణించగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు.
55 సహాయక శిబిరాలు, 12 ఆహార సరఫరా కేంద్రాలను అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో దాదాపు 40వేల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. ఇక అస్సాంలో ఆదివారం నుంచి ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందారు. వీరందరు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ప్రాణాలు విడిచారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మే 1-16 మధ్య సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.