సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీశైల మల్లన్న దర్శనార్థం విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్.రామరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద స్వాగతం పలికి ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో సీజేఐ ఎన్వీ రమణ దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు.
అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో సీజేఐ ఎన్వీ రమణకు వేద పండితులు వేద మంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దేవస్థాన ఈవో కేఎస్.రామరావు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఇటీవల దేవస్థానం ప్రచురించిన స్కంధ పురాణంలోని శ్రీశైలం ఖండ మూల ప్రతిని పరిష్కరించి సంస్కృతంలో మూల గ్రంథమును తెలుగులో శ్లోక బావార్ధములను రూపొందించడంలో ముఖ్య పాత్రను పోషించిన త్రిష్టి లక్ష్మీ సీతారామాంజనేయ శర్మ గారిని సీజేఐ గారు సత్కరించారు.
తరువాత శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంట మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామన శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్కియాలజీ ఆఫ్ సర్వే ఇండియా మైసూరు విభాగపు డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి శాసనలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను సీజేఐ గారికి వివరించారు.