Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్నీలకంఠాపురంలో  ఆలయాల ప్రతిష్ఠాపన

నీలకంఠాపురంలో  ఆలయాల ప్రతిష్ఠాపన

Neelakanthaapuram Temples Inauguration :

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, నూతన దేవాలయాల ప్రతిష్టాపన మహోత్సవాలు రేపటి నుంచి (శనివారం, జూన్ 19) ప్రారంభం కానున్నాయి. నీలకంఠాపురం  ఒక పుణ్య క్షేత్రం. ఇక్కడి నీలకంఠేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం పోతుగుండు పట్టణం నుండి ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి స్థల మార్పిడి చేసి ఆ నీలకంఠేశ్వర స్వామి పేరుమీదే ఈ గ్రామానికి నీలకంఠాపురంగా నామకరణం చేశారు.  ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ దేవాలయంలో కొలువైన శివుడు 1200  సంవత్సరాల నుండి పూజలందుకుంటున్నాడని అనేక చారిత్రిక ఆధారాలతో ధ్రువీకరించారు.

45 సంవత్సరాల క్రితం – 1976లో స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఎంపి  స్వర్గీయ శ్రీరామిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఈ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరి సహకారంతో ఆలయ పురనుద్ధరణతో పాటు నూతన ఆలయాలు కూడా నిర్మాణం చేసి 1982లో ప్రతిష్ఠాపన మహోత్సవాలు చేశారు. ఈ దేవాలయ సముదాయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి, శ్రీ పార్వతి దేవి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయస్వామి, శ్రీ రంగనాథ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, నవగ్రహాల ప్రతిష్ఠాపన జరిగి ఈనాటి వరకు నిత్య పూజా కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి.

1999లో సర్గీయ నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులు, ఈ ప్రాంత ప్రజలు ఇదే దేవాలయ సముదాయంలో శ్రీ సరస్వతి దేవాలయాన్ని నిర్మాణం చేసి 2004లో ప్రతిష్ఠాపన చేశారు.  ఈ ఆలయంలో కూడా ప్రతిరోజూ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయాలకు మన రాష్ట్రం నుండే కాక, పొరుగున ఉన్న కర్నాటక నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు.  ప్రత్యేకించి పండుగల సందర్భంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

ఈ దేవాలయాలను సందర్శించిన ప్రముఖుల్లో ఆనాటి ముఖ్యమంత్రులు నీలం సంజీవ రెడ్డి,  కాసు బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళ రావు,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే, కర్నాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన నిజలింగప్ప,  వీరేంద్ర పాటిల్,  వీరప్ప మొయిలీ కూడా ఆలయాలను సందర్శించారు.  గవర్నర్లుగా పనిచేసిన పెండేకంటి వెంకట సుబ్బయ్య, కృష్ణ కాంత్,  ఈఎస్ ఎల్ నరసింహన్ ఈ ఆలయాన్ని సందర్శించారు.

ప్రముఖ పీఠాధిపతులు శ్రీ తిరుచ్చి స్వాముల వారు, శ్రీ శృంగేరి శారదా పీఠం స్వాముల వారు, శ్రీ  సిద్ధ గంగ స్వాముల వారు, శ్రీ నంజావధూత స్వాముల వారు, శ్రీ శివగంగ స్వాముల వారు, శ్రీ జపానంద స్వాముల వారు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఆలయాన్ని దర్శించారు.

నిత్యం కరువు కాటకాలతో సతమతమయ్యే ఈ  ప్రాంత ప్రజలు తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అప్పుల పాలు కాకూడదని భావించి స్వర్గీయ శ్రీరామిరెడ్డి ఈ ఆలయంలో ప్రతి శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణంతో పాటు ఉచిత సామూహిక వివాహాలను 1982లో ప్రారంభించారు. 2020 వరకూ 4 వేలకు పైగా వివాహాలు జరిగాయి. దేవాలయ ప్రాంగణంలో ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించి పేదవారు వివాహాలు జరుపుకోవడానికి ఉచితంగా ఏర్పాటు చేశారు.

Neelakanthaapuram Temples Inauguration

Neelakanthaapuram Temples Inauguration :

దసరా నవరాత్రులలో ప్రత్యేక పూజలు జరిపి విజయ దశమి రోజు జంబూ సవారీ నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ సందర్భంగా రైతులను ప్రోత్సహించడానికి ఉత్తమ రైతులకు, ఉత్తమ ఎద్దులకు బహుమతులు కూడా అందజేస్తున్నారు.  ప్రతి పండుగకూ ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా  పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి.

2 సంవత్సరాల క్రితం  నీలకంఠాపురం రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు, ఈ ప్రాంత ప్రజలు కలిసి పాత దేవాలయాల జీర్ణోద్ధరణతో పాటు కొత్తగా శ్రీ విజయ గణపతి, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి,  శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీ షిరిడీ సాయి బాబా, 50 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలను నిర్మాణం చేయడానికి నడుం బిగించారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 15 గర్బగుడులతో ఈ ప్రాంతంలోనే ఈ ఆలయం పెద్ద దేవాలయ సముదాయంగా ప్రత్యేకతను సంతరించుకుంది, ఆలయాన్ని పూర్తి ఆగమ శాస్త్ర విధానాలతోనే నిర్మాణం చేశారు. ఆలయం చుట్టూ మాడ వీధులు, నాలుగు దిక్కులకూ నాలుగు ప్రవేశ ద్వారాలు నిర్మాణమయ్యాయి. ప్రత్యేకించి ఉత్తర ప్రవేశ ద్వారమైన వైకుంఠ ద్వారం శోభాయమానంగా తయారైంది, చోళ, చాలుక్య, పల్లవ, నోళంబుల కాలం నాటి శైలిని ఈ దేవాలయ నిర్మాణంలో అనుకరించారు. 162 మూల స్తంభాలతో దేవాలయం కనుల పండుగగా తయారయ్యింది. ఆలయం ఈశాన్య దిక్కున అందమైన పుష్కరిణి సిద్ధమయ్యింది. ఆగ్నేయ దిక్కున యాగశాల ఉంది.

Neelakanthaapuram Temples Inauguration

పంచాముఖాంజనేయస్వామి ఆలయంలో విగ్రహం చుటూ నిర్మించిన మండపాలలో రామాయణ ముఖ్య ఘట్టాల శిల్పాలను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయాల నిర్మాణానికి లక్షా నలభై వేలమంది భక్తులు స్వచ్చందంగా తలా ఒక ఇటుకను విరాళంగా ఇచ్చారు.  ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలకు ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలలో పూజలు చేసి ఇక్కడకు తీసుకొచ్చారు. దేశంలోని పవిత్ర నదుల జలాలను  ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. సర్వాంగ సుందరంగా తయారైన ఈ ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు 2021 జూన్ 19 నుండి 23 వరకూ శాస్త్రోక్తంగా జరగనున్నాయి. కరోనా కరాళ నృత్యం చేస్తున్నవేళ ఈ ఆలయాల ప్రారంభోత్సవాలను వేలాది జనం మధ్య సందోహంగా చేయడం కుదరని పని. కట్టిన ఆలయాలను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రారంభించకుండా ఎక్కువ కాలం వదిలేయడం కూడా శాస్త్ర ప్రకారం మంచిది కాదు. ఈ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అతి పరిమిత సంఖ్యలో ఋత్వికులు, పురోహితులు మాత్రమే హాజరై శాస్త్రోక్త విధివిధానాలతో ఈ ఆలయాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగానే శ్రీ పార్వతి దేవి గర్భగుడిలో, శ్రీ సరస్వతి దేవి గర్భగుడిలో శ్రీ చక్రాల ప్రతిష్ఠాపన కూడా జరగనుంది.

Also Read : జమ్మూలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్