Saturday, November 23, 2024
HomeTrending Newsఆస్తుల కోసమే మోకరిల్లిన ఈటెల :మంత్రి గంగుల

ఆస్తుల కోసమే మోకరిల్లిన ఈటెల :మంత్రి గంగుల

మాజీ మంత్రి ఈటెల రాజెంద‌ర్ కబ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని బిసి సంక్షేమ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువ‌త చేరిన కార్య‌క్ర‌మంలో గంగుల క‌మ‌లాక‌ర్ పాల్గొని వారికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ తెలంగాణ‌ను ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపిస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప వ్య‌క్తిని ఇష్టానుసారంగా అనుచిత వాఖ్య‌లు చేస్తే ప్ర‌తీ తెలంగాణ బిడ్డ తిర‌గ‌బ‌డ‌తాడ‌ని గంగుల హెచ్చరించారు.

కేసీఆర్ వ‌ద్ద  ఆత్మ‌గౌర‌వంతో పనిచేసిన ఈటెల, ఇప్పుడు త‌న ఆత్మ‌గౌరవంతో పాటు తెలంగాణ బిడ్డ‌లైన హుజురాబాద్ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని డిల్లీ చెట్ల‌కింద తాక‌ట్టు పెట్టాడ‌ని మంత్రి గంగుల ఎద్దేవా చేశారు. కేవ‌లం ఆస్థులు కాపాడుకోవ‌డం కోసమే ఈటెల డిల్లీ పెద్ద‌ల‌కు గులామ్ అయ్యాడ‌ని మండిప‌డ్డారు. బిజేపీలో చేరిన త‌ర్వాత తొలిసారి హుజురాబాద్ వ‌చ్చిన ఈటెల కేసీఆర్ కు ఘోరీ క‌డుతామ‌ని చేసిన వాఖ్య‌ల‌పై గంగుల‌ తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపారు.

స‌మైక్య పాల‌నలో అరిగోస ప‌డుతున్న తెలంగాణ‌ని విముక్తి చేసిన కేసీఆర్, బంగారు తెలంగాణ కోసం అహ‌ర్నిశలు కృషిచేస్తున్నార‌న్నారు. దేశంలో ఎక్క‌డాలేని విదంగా రైతుబందు, రైతుబీమా, 24గంట‌ల ఉచిత క‌రెంట్, బిసి, ఎస్సీ,ఎస్టీ అణ‌గారిన వ‌ర్గాల బంగారు భ‌విష్య‌త్ కోసం గురుకులాలు, అవ్వ అయ్యా ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌ని ఆస‌రా ఫించ‌న్లు ఇంకా ఎన్నో ప‌థ‌కాలు అందిస్తున్నందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ఘోరీ క‌ట్టాలా అని ప్ర‌శ్నించారు.  ఈటెల రాజెంద‌ర్ కు రాబోయే హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఘోరీ క‌డుతార‌ని, ఆయ‌న చేసిన అక్ర‌మాల‌ని ప్ర‌శ్నిస్తార‌ని మంత్రి గంగుల అన్నారు.

ఆర‌వై ఏళ్ల ఆత్మ‌గౌర‌వ పోరుతో సాధించిన తెలంగాణ  క‌న్నా స‌మైక్య పాల‌నే బాగుంద‌నే త‌న అభిప్రాయాన్ని ఈటెల త‌న భార్య జ‌మున‌తో చెప్పించార‌న్న మంత్రి గంగుల కమలాకర్ ఇంత‌కన్నా దౌర్బాగ్యం ఉంటుందా అని విమర్శించారు. స‌మైక్య‌మే ముద్ద‌న్న ఈటెల‌ను చేర్చుకున్న బీజేపీ ఈ విష‌యంలో త‌మ వైఖ‌రి ఏంటో బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈటెల ఏనాడు హుజురాబాద్ని ప‌ట్టించుకోలేద‌ని, కేవ‌లం త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే మాట్లాడి హుజురాబాద్ ను అభివృద్దిలో వెనుక‌కు నెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు. హుజురాబాద్లో ఏవిద‌మైనా అభివృద్ది జ‌ర‌గ‌లేద‌ని సీఎం కేసీఆర్ కు చెప్పిన వెంటనే నిదులు మంజూరు చేశార‌ని గంగుల‌ కమలాకర్  గుర్తుచేశారు. రాబోయే ఉపఎన్నిక‌లే టీఆర్ఎస్ కు, కేసీఆర్ గారికి ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ తెలియ‌జేస్తాయ‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ని విద్యార్థి సంఘాల నాయకులు TNSF పార్లమెంట్ ఇంచార్జ్ టేకుల శ్రవణ్, AIYF కరీంనగర్ జిల్లా కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్ , AISB రాష్ట్ర కార్యదర్శి కొలుగురు సూర్య కిరణ్ ,హుజురాబాద్ BJYM నాయకులు దొడ్డిపెళ్లి రాకేష్ తో పాటుగా నియోజకవర్గంలో ని విద్యార్థి,యువజన సంఘాల  నాయకులు సుమారు 100 మంది ఈరోజు మంత్రి  సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు, హుజురాబాద్ మున్సిపాలిటీ మాజీ చేర్మెన్ వడ్లూరి విజయ్ కుమార్ విద్యార్థులు,యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్