Saturday, April 20, 2024
HomeTrending Newsనోరు అదుపులో పెట్టుకో :లోకేష్ కు కాటసాని హెచ్చరిక

నోరు అదుపులో పెట్టుకో :లోకేష్ కు కాటసాని హెచ్చరిక

నారా లోకేష్‌ ఒక బఫూన్‌ కంటే ఎక్కువ…జోకర్‌ కంటే తక్కువ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అభివర్ణించారు. పులి బిడ్డ పులి బిడ్డే, నక్క బిడ్డ నక్క బిడ్డనే అవుతుందని అన్నారు. జగన్ పులి బిడ్డ అయితే, లోకేష్ ఎప్పటికీ నక్క బిడ్డగానే మిలిగిపోతారని జోస్యం చెప్పారు. లోకేష్ ఈరోజు మాట్లాడిన మాటలు సంస్కార హీనంగా ఉన్నాయని, వాడు, వీడు అంటూ మాట్లాడడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని కాటసాని హెచ్చరించారు. సిఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి లోకేష్ కు లేదన్నారు.

ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఎప్పుడో స్వస్తి చెప్పామని, ఒడ్డు ప్రతాపరెడ్డి, నాగేశ్వరరెడ్డి హత్యలతో తనకు సంబంధం లేదని కాటసాని స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ సంస్థతో అయినా విచారణ చేయించవచ్చని, దాన్ని స్వాగతిస్తామని, ఒకవేళ భారత దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేకపోతే విదేశీ సంస్థలను తీసుకువచ్చి అయినా విచారణ చేయించావచ్చని సవాల్ చేశారు. జంట హత్యల కేసులో మా ప్రమేయం ఉందని తేలినా, మేము ఆ హత్యలను ప్రోత్సహించామని తేలినా, ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

ఇలాంటి సందర్భాల్లో పరామర్శ కు వచ్చినపుడు అందరూ సామరస్యంగా ఉండాలని కోరాలని, ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పాల్సింది పోయి, మా పార్టీ వస్తే ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా లోకేష్ మాట్లాడడం బాధాకరమని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు.

లోకేష్ చేసిన ఛాలెంజ్ ప్రస్తావిస్తూ నన్ను ఛాలెంజ్‌ చేయడానికి లోకేష్ వయసెంత అని ఎద్దేవా చేశారు. ‘నువ్వు పిల్లోడివి. నేను 1985 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. దగ్గర దగ్గర మీ నాయనతో పాటే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ తాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేను. మళ్లీ మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యేను. అందుకే కనీసం ఎవరు ఎటువంటి వారు అన్నది తెలుసుకుని మాట్లాడాలి’ అంటూ లోకేష్ కు హితవు పలికారు.

అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేశారో గుర్తు చేసుకోవాలని లోకేష్ కు సూచించారు. ఇవాళ టిడిపి కార్యకర్తలు స్వేచ్ఛగా తిరగ గలుగుతున్నారని, ఆ విధంగా మేము వ్యవహరిస్తున్నామని తెలిపారు. నిన్న హత్య చేయబడిన ఇద్దరూ 2009 నుంచి 2014 వరకు నాతో ఉన్నారు. మొన్న కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాతో మాట్లాడారని వివరించారు. లోకేష్ పద్దతిగా మాట్లాడాలని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాటసాని సూటిగా లోకేష్ ను హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్