Emotional: రాజశేఖర్ ని ఇప్పటికీ కూడా యాంగ్రీ యంగ్ మేన్ అనే పిలుస్తుంటారు. అందుకు కారణం ఆయన చేసిన యాక్షన్ ప్రధానమైన సినిమాలు. ఆయన పాత్రల్లో బుసలుకొట్టే ఆవేశం .. విరుచుకుపడే వీరత్వం కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఆయన చేసిన పోలీస్ పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ రాజశేఖర్ అనే పేరు వచ్చేసింది. ఆయన కెరియర్ కి బాగా హెల్ప్ చేసిన పాత్రలు .. ఆయనను ఇప్పటివరకూ ఇండస్ట్రీలో నిలబెట్టిన పాత్రలు అవే. అలాంటి రాజశేఖర్ తాజా చిత్రంగా రూపొందిన ‘శేఖర్’ థియేటర్లకు వచ్చింది.
జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో వచ్చిన ‘జోసెఫ్’ సినిమాకి రీమేక్. మనసిచ్చిన అమ్మాయికి దూరమైన శేఖర్ .. ఆమె కోరిక మేరకే మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఆ ప్రియురాలి మరణానికి తాను కారణమని భావించి, ఆ బాధలో భార్యకు దూరమవుతాడు. భార్యతో పాటు తన కూతురిని కూడా కోల్పోతాడు. వేరు వేరుగా జరిగిన ప్రమాదాలలో వాళ్లు ఈ లోకం నుంచి వెళ్లిపోతారు. అయితే ఆ ప్రమాదాలకు .. వాళ్ల మరణాలకు మెడికల్ మాఫియా కారణమని తెలుసుకున్న శేఖర్ ఏం చేస్తాడు? అనేదే కథ.
మూలకథను ఎక్కడా కదల్చకుండా జీవిత ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మూలంలో లేని పాటలను జోడించారు. ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ ఉండడు .. మెడికల్ మాఫియాకి సహకరించే ప్రతి ఒక్కరూ విలనే అనుకోవాలి. టైటిల్ కి తగినట్టుగా తెరపై శేఖర్ మాత్రమే కనిపిస్తాడు. మిగతా పాత్రలేవీ బలమైనవిగా అనిపించవు .. కనిపించవు. ఉన్న ఆ కాసిన్ని పాత్రల్లో ఆర్టిస్టులు అతకలేదు. ముస్కాన్ గ్లామర్ తో మెరిసింది .. కాకపోతే కాసేపే. కథాకథనాలు ఓకే .. కానీ మలయాళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఇక్కడ నడపడమే మైనస్ గా కనిపిస్తుంది. యాక్షన్ హీరో చేసే పూర్తిస్థాయి ఎమోషనల్ జర్నీని చూడటానికి సిద్ధమైతే ఈ సినిమాకి వెళ్లొచ్చు.
Also Read : నేను సినిమాల్లోకి రావడానికి రాజశేఖర్ గారే కారణం : సుకుమార్