Saturday, April 20, 2024
HomeTrending Newsరైతులను తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్, బిజెపి

రైతులను తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్, బిజెపి

Misleading Farmers : రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది పంజాబ్, యూపీ, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల రైతు కుటుంబాలకు చేస్తున్న సాయంపై విపక్షాల విమర్శలను ఖండిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో నేటి వరకు 80,755 రైతు కుటుంబాలకు రైతుభీమా అందించామని, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి భీమా లేదన్నారు.

రైతు భీమాతో వ్యవసాయ కుటుంబాలకు ధీమా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు చేస్తున్న రూ.3 లక్షల సాయంపై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర రాజకీయాలు అని విమర్శించారు. అసలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి పథకం అమలు చేసే దమ్ముందా ? కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.50 వేల సాయం అందాలంటే ఎక్కని గడప, మొక్కని నాయకుడు ఉండేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాత నిర్ణయాల మూలంగా రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల సాయం పది రోజులలో ఎలాంటి పైరవీలు, కమిటీలు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు కుటుంబాలకు అందుతున్నదని పేర్కొన్నారు.

ప్రభుత్వమే రైతులకు ప్రీమియం చెల్లించి  అమలుచేస్తున్న గొప్ప పథకమని, రైతుభీమా అందుకున్న రైతులందరివీ ఆత్మహత్యలని ప్రచారం చేస్తున్న దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ అన్నారు. రైతు డిక్లరేషన్లు కాదు ముందు మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో వాటిని ఈ ఏడాది నుండి అమలుచేసి చూపండని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం అంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్లే .. దశాబ్దాల కాంగ్రెస్ పాలన చూసి విసుగుచెంది ప్రజలు ఆ పార్టీని పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు.

అధికారం మీద ఆశతో కాంగ్రెస్, బీజేపీలు పగటి కలలు కంటున్నాయని, రైతుభీమానే కాదు 63 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు ఎనిమిది విడతలలో రూ.50,447.33 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమచేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఢిల్లీలో పోరాడి అసువులు బాసిన రైతులకు ఈ దేశమంతా సంఘీభావంగా నిలిచి వారి కుటుంబాలను బాసట నివ్వాల్సిన అవసరం ఉన్నది. వారి  పోరాట ఫలితంగానే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పిన విషయం మరవద్దు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న నల్లచట్టాలను బీజేపీ ప్రభుత్వం అమలుచేసింది .. అందుకే  ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మొహంలేక రైతుల వద్దకు వెళ్లడం లేదు.

16 నెలలు చలి, వాన, ఎండలలో పోరాడి మరణించిన  కుటుంబాలకు సాయంచేస్తున్న కేసీఆర్ ను అభినందించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటు. ఆ రైతులు ఎవరో పరాయిదేశం వారు అయినట్లు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు విషయం చిమ్మడం దురదృష్టకరమని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : కందులు, ఆయిల్ పామ్, పత్తి సాగుతో లాభాల పంట

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్