కాంగ్రెస్ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కిన కపిల్ సిబాల్ సమాజ్ వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజ్యసభకు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన కపిల్ సిబల్ ఇవాళ రాజ్యసభకు లక్నోలో నామినేషన్ దాఖలు చేశారు. సిబల్‌కు సీనియర్ న్యాయవాదిగా యాదవ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2017 జనవరిలో (యాదవుల కుటుంబ కలహాల సమయంలో) సిబల్ ఎన్నికల సంఘం వద్ద అఖిలేష్ యాదవ్‌కు ‘సైకిల్’ గుర్తు కావాలని వాదించారు. చివరకు అఖిలేష్‌కే గుర్తు వచ్చింది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విధానాలతో విభేదిస్తూ జీ23గా ఏర్పడిన గ్రూప్ లో భాగంగా ఉన్న కపిల్ సిబల్.. పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ అభ్యర్ధిత్వాన్ని తిరిగి పార్టీ రెన్యువల్ చేసే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ వార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి మే 16నే కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.