ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సహచరులతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించి ఈ రోజు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్ గణేశ్ లాల్ ఈ రోజు భువనేశ్వర్ లోని లోక్ సేవా భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. 21 మందిని మంత్రిపదవులు వరించగా అందులో ఏడుగురు మొదటిసారిగా మంత్రి పదవి అలంకరిస్తున్నారు. ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం దక్కింది. మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన కొద్ది సేపటికే వారికి శాఖలు కూడా కేటాయించారు. 13 మందికి క్యాబినెట్ హోదా దక్కగా 8 మందికి స్వతంత్ర హోదా కల్పించారు.
ఇటీవలే నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం మూడేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈక్రమంలో కేబినెట్ విస్తరణకు పూనుకున్నారు. ఒడిశాలో 2024లోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఐదోసారి నవీ పట్నాయక్ ప్రభుత్వం పాలిస్తోంది. ఈసారి కూడా ప్రజా వ్యతిరేకతను దాటుకుని మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తున్నారు. ఈదిశగా పావులు కదుపుతున్నారు. ఐతే కొందరు మంత్రుల పనితీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందన్న ప్రచారం ఉంది. ఈక్రమంలోనే నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
నవీన్ పట్నాయక్ 22 ఏళ్ళ పరిపాలనకు చెక్ పెట్టి ఒడిశాలో పాగా వేయాలని బీజేపీ స్కెచ్‌లు వేస్తోంది. ఆ పార్టీకి అవకాశం ఇవ్వకుండా మళ్లీ గెలవాలని నవీ పట్నాయక్ భావిస్తున్నారు. ఆ దిశగా పార్టీని సంసిద్ధం చేస్తున్నారు.