Saturday, September 21, 2024
HomeTrending Newsనైజీరియా చర్చిలో కాల్పులు.. 50 మంది మృతి

నైజీరియా చర్చిలో కాల్పులు.. 50 మంది మృతి

నైజీరియాలో ఉన్మాది దాడులకు పాల్పడ్డాడు. నైరుతి ప్రాంతం ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది వరకు మరణించారని తెలుస్తుంది. మరణించిన వారిలో చాలామంది చిన్నారులు ఉన్నారు.

ఒండో రాష్ట్రం ఓవో నగరంలోని క్యాథలిక్ చర్చిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ క్యాథలిక్‌ చర్చికి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం వచ్చిన సమయంలో ఈ ముష్కర మూకలు దాడిచేసి చర్చి ప్రధాన పాస్టర్‌ను అపహరించారు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 50 నుంచి 70 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక నేత టిమిలెయిన్‌ పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలతో చర్చిలో భయానక వాతావరణం నెలకొంది. నైజీరియాలో ఇటీవల జరిగిన అత్యంత భయానక ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని ఖండించిన ముహ్మద్ బుహారీ.. రక్తపాతాన్ని అంతం చేస్తామని వాగ్దానం చేశారు. కాగా, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. దాడి తర్వాత ఆ ప్రాంతమంతా హాహాకారాలు, ఆర్తనాదాలతో నిండిపోయింది.

నైజీరియా ఇస్లాం ఉగ్రవాదంతో బాధపడుతుండగా.. దేశంలో శాంతియుత రాష్ట్రంగా ఓండో ప్రసిద్ధి చెందింది. నైజీరియాలో సామాజిక, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అల్లర్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. నైజీరియాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా దానికి ముందు జరుగుతున్న హత్యలు, కిడ్నాప్‌లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.

Also Read :

అమెరికా విషాదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్