Challenges: ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు పేరుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి, రాజకీయ కార్యక్రమం చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదని, కానీ నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దేశం మొత్తం మీద, చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వం అమలు చేసుత్న్న రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, పవన్ ఇక్కడ రైతులకు మేలు జరగడం లేదని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు.
దసరా పండగ తర్వాత తామేంటో చూపిస్తానని పవన్ అంటున్నారని, గతంలో కూడా అలా చాలా పండగలు చెప్పారని, అవి వచ్చాయి- పోయాయి. కాబట్టి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం అంటే, విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, జగన్‌గారిని విమర్శించడమేనని. ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఏమీ చేయడం లేదని విమర్శించడమేనని నాని ఎద్దేవా చేశారు. రైతులకు అండగా తమ ప్రభుత్వం నిలబడినట్లుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ నిలబడ్డాయా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. ఆ ప్రభుత్వాలు ఏవీ కూడా కౌలు రైతులను పట్టించుకోలేదని, ఇప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కౌలు రైతులకు ఏ విధంగానూ మేలు చేయడం లేదని, అయినా ఏనాడూ పవన్‌కళ్యాణ్, కేంద్రాన్ని నిలదీయడం లేదని ధ్వజమెత్తారు. మీకు చేతనైతే, మీలో నిజంగా నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంతో కౌలు రైతుల కోసం చట్టం చేయించాలని సవాల్ విసిరారు. మీరు చంద్రబాబు దత్తపుత్రుడు కాకపోతే, 2024లో ఒంటరిగా వెళ్లాలని ఛాలెంజ్ చేశారు
Also Read : ప్రజలతోనే మా పొత్తు: పవన్