Thursday, March 28, 2024
HomeTrending Newsప్రజలతోనే మా పొత్తు: పవన్

ప్రజలతోనే మా పొత్తు: పవన్

From Dasara: వైసీపీ నేతలు ఏం మాట్లాడతారో మాట్లాడాలని, కానీ దసరా నవరాత్రుల తర్వాత తాము మాట్లాడడం మొదలు పెడతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారు మాట్లాడే మాటలు అన్నీ తాము వింటామని, భరిస్తామని, దసరా నుంచి తాము మాట్లాడతామని చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరులో పర్యటించిన పవన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం ఇది కాదని, అయినా తన పొత్తు ప్రజలతోనేనని ప్రకటించారు.  ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు ఈ పర్చూరు సభ ద్వారా, కౌలు రైతుల భరోసా యాత్ర ద్వారా ఓ భరోసా ఇస్తున్నామని… ఆంధ్ర ప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, యువతకు ఉద్యోగాలు రావాలని, ఉపాధి అవకాశాలు కావాలని, విశ్రాంత ఉద్యోగులకు సరైన పెన్షన్ రావాలని, కన్నీరు పెట్టని రైతాంగం ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని పవన్ వివరించారు.

క్రిమినల్ కేసులుంటే ఉద్యోగాలు రావని, పాస్ పోర్ట్ కూడా ఇవ్వరని, ఆర్మీలో చేరాలంటే ఇంకా కఠిన నిబంధనలు ఉంటాయని అలాంటప్పుడు క్రిమినల్ కేసులున్నవారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ప్రజల కోసం నిలబడతామని 2009లో మాట ఇచ్చానని, గెలుపు గానీ, ఓటమి గానీ ఏదైనా తట్టుకొని నిలబడతామని స్పష్టం చేశారు. అలా చేయలేకపోతే ఇచ్చిన మాట తప్పినట్లు అవుతుందని, అందుకే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని దెబ్బలు తిన్నా, ఇబ్బందులు ఉన్నా పోరాడుతున్నామని చెప్పారు.  ఇన్నేళ్ళ పాటు ప్రజలకోసం కష్టాలు ఎదురైనా పోరాటం చేశామని, ఈసారి ప్రజల అండదండలు కావాలని, ప్రజలు అండగా ఉంటే ఈ రాష్ట్రం నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Also Read : 2024లో తగ్గేదే లేదు: పవన్ స్పష్టం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్