ఉయ్ఘర్ ముస్లింల మీద చైనా ప్రభుత్వం దమనకాండ ఆపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ డిమాండ్ చేసింది. జింజియాంగ్ ప్రావివ్స్ లో మైనారిటీల సామూహిక హననం జరుగుతోందని UNHRC ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (యు.ఎన్.హెచ్.ఆర్.సి.) సమావేశంలో కెనడా, జర్మనీ, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్ తదితర 40 దేశాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మైనారిటీల పట్ల చైనా అనుసరిస్తున్న విధానాలపై UNHRC తరపున కెనడా ఓ సంయుక్త నివేదిక విడుదల చేసింది.
వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అంతర్జాతీయ పరీశీలకుల బృందం జింజియాంగ్ సందర్శించేందుకు చైనా సహకరించాలని సమావేశంలో తీర్మానించారు. ఉయ్ఘర్ ల హక్కుల్ని కాలరాస్తూ వేల మందిని కమ్యూనిస్టు పాలకులు నిర్భందిస్తున్నారని, చైనా విధానాల్ని వ్యతిరేకిస్తున్న హక్కుల కార్యకర్తల్ని హతమారుస్తున్నారని UNHRC ఆరోపించింది. పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి దూర ప్రాంతాల్లో ఉంచుతున్నారని, పిల్లలు, మహిళలను లైంగిక వేధింపులతో హింసిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.
జింజియంగ్ ప్రావిన్సు లో మైనారీటీల జనాభా నియంత్రణకు చైనా అమానవీయ విధానాలు అమలు చేస్తోంది. ఆ ప్రాంతంలో జనాభా సమతూకం చేసేందుకు ఉయ్ఘర్ లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయటం బహిరంగ రహస్యం. గతంలో టిబెట్ దేశాన్ని ఆక్రమించినపుడు కూడా చైనా పాలకులు ఇదే విధానం అనుసరించారు.
టిబెట్, హాంకాంగ్ లలో ప్రజావామ్యవాదుల్ని రహస్య ప్రాంతాల్లో బందీలుగా నిర్భందిస్తోంది. బందీలకు సరైన ఆహారం అందించంకుండా, వారి కుటుంబ సభ్యులు, అంతర్జాతీయ సమాజానికి ఆనవాళ్ళు కూడా దొరకకుండా హతమారుస్తోంది.