రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పట్టపగలే టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజస్థాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాజస్థాన్ లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ పెట్టారు. వారం రోజుల పాటు ఇంటర్ నెట్ సేవలపై బ్యాన్ విధించారు. ఘటన జరిగిన ఉదయ్ పూర్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కేంద్ర హోంశాఖ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. అల్లర్లు మధ్యప్రదేశ్ వ్యాపించే అవకాశం ఉందని నిఘా వర్ఘాలు హెచ్చరించటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది.
ఉదయ్ పూర్ ఘటనను కాంగ్రెస్ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణ హత్యతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని రాహల్ గాంధీ ట్వీట్ చేశారు. మతం పేరుతో చేసే క్రూరత్వాన్ని సహించలేమన్నారు. ఈ క్రూరత్వానికి పాల్పడి జనాలను భయాందోళనలకు గురి చేసిన వారిని వెంటనే శిక్షించాలన్నారు. దేశ ప్రజలంతా సంయమనం పాటించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటన చాలా బాధాకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మతం పేరుతో ఇలా ఒకరిని చంపడం చాలా బాధాకరం, అవమానకరం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడానని చెప్పిన అశోక్ గెహ్లాట్.. జనాలు సంయమనం పాటించాలని కోరారు. కేసు విచారణను అత్యంత వేగంగా జరుపుతామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టైలర్ హత్యకు సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు.