గోపీచంద్ – రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘పక్కా కమర్షియల్‘ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 -యూవీ సంస్థవారు కలిసి నిర్మించిన ఈ సినిమాకి, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. మారుతి సినిమా అనగానే ఖర్చు తక్కువ .. కంటెంట్ ఎక్కువ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆయన సినిమాలలో లవ్ .. ఫ్యామిలీ డ్రామా .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కలిసిపోయి కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రమైన ‘పక్కా కమర్షియల్’ విషయానికి వచ్చేసరికి, కామెడీకి కాసిన్ని మార్కులు తగ్గుతాయనే చెప్పాలి.
ఈ సినిమాలో పాత్రల పరంగా సత్యరాజ్ నాన్ కమర్షియల్ .. ఆయన కొడుకు పాత్రను పోషించిన గోపీచంద్ పక్కా కమర్షియల్. ఒక అవినీతి పరుడిని కోర్టు బోనులో నిలబెట్టడానికి సత్యరాజ్ ప్రయత్నిస్తుంటే .. అదే వ్యక్తిని కాపాడటానికి గోపీచంద్ ట్రై చేస్తుంటాడు. అలా ఈ విషయంలో ఈ ఇద్దరి మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీరియల్ ఆర్టిస్ట్ అయిన రాశి ఖన్నా ప్రేమలో గోపీచంద్ పడతాడు. వాళ్ల మధ్య కామెడీ టచ్ తో కూడిన సీన్స్ నడుస్తుంటాయి. అలవాటు ప్రకారం మధ్య మధ్యలో పాటలు వచ్చిపోతుంటాయి.
హీరో ‘పక్కా కమర్షియల్’ అనే స్థాయిలో టైటిల్ పెట్టినప్పుడు ఆ స్థాయి సీన్స్ పడాలి. వాటిని కామెడీ టచ్ తోనే డిజైన్ చేయాలి. ఆ లెవెల్లో కసరత్తు చేసినట్టుగా కనిపించదు. ‘అప్పుల అప్పారావు’ సినిమాలో రాజేంద్రప్రసాద్ నిద్రలేస్తూ ‘అప్పు’డే తెల్లారిందా? అంటాడు. ఆ రేంజ్ లో క్యారెక్టరైజేషన్ ఉండాలి … పండాలి. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. తెరపై గోపీచంద్ కి ఫ్యామిలీ ఉన్నప్పటికీ ఎమోషన్స్ ఉండవు .. రాశి ఖన్నాకి అసలు ఫ్యామిలీనే ఉండదు. యాక్షన్ సీన్స్ లో గోపీచంద్ .. కామెడీలో రాశి ఖన్నా ఎక్కువ మార్కులు కొట్టేస్తారు. రావు రమేశ్ పాత్ర కొత్తగా ఏం అనిపించదు. కథాకథనాల విషయంలో .. ముఖ్యంగా కామెడీ విషయంలో మారుతి మరికాస్త దృష్టిపెట్టవలసిందేమో.