ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్ చాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించనున్న కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడల అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన సాధ్యమేనని స్పష్టం చేశారు. ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ వీసీగా నియమితులైన మల్లేశ్వరి మీడియాతో మాట్లాడారు.
చిన్నతనం నుంచే క్రీడలపై మనసు లగ్నం చేస్తే యుక్త వయసు నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడం, పతకాలు సాధించడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్రీడా యూనివర్సిటీలో ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ వరకు కోర్సులుంటాయన్నారు. ‘ఆరో తరగతి నుంచే క్రీడల్లో శిక్షణ ఇస్తే ఈ రంగంలో మరింత దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది… ప్రస్తుతం అందుబాటులో ఉన్న అకాడమీల్లో ఏదో ఒక క్రీడ మాత్రమే నేర్చుకునే వీలుంది. యూనివర్సిటీలో పలు క్రీడల పట్ల అవగాహన పెంచుకుని తగిన క్రీడను ఎంచుకునేందుకు అనేక అవకాశాలుంటాయి’ అని ఆమె వివరించారు
క్రీడలను కెరియర్‌గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసాన్నివిద్యార్థులకు కల్పించేలా ఈ వర్సిటీ ఉంటుందని, క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మల్లేశ్వరి చెప్పారు. ఢిల్లీకే కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇది ఒక వరం లాంటిందని, త్వరలోనే వీసీగా బాధ్యతలు చేపడతానని వెల్లడించారు. అధికారులు, ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాలు, అర్హతలు, ఇతరత్రా అంశాలపై నిర్ణయం తీసుకుంటామని కరణం మల్లీశ్వరి వివరించారు.