Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒక 'చిత్రం' వెనుక కథ 

ఒక ‘చిత్రం’ వెనుక కథ 

Working Woman: ఒక నిరుపేద మహిళ…భర్త, పిల్లలు ఉంటారు. కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకుని రోజుకూలీగా, చిన్నా చితకా పనులు చేస్తుంది. భర్త పైన ఆధారపడే అవకాశం కూడా ఉండదు. అయినా ఆమె కష్టానికి ఎటువంటి గుర్తింపూ ఉండదు. ఆశించదు కూడా

మధ్యతరగతి మహిళ… భర్త బాధ్యత మరవచ్చు. అనారోగ్యం కారణంగా పని చేయలేకపోవచ్చు. కుటుంబం కోసం చేతనైన పని వెతుక్కుని తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ తనవాళ్లను పైకి తీసుకొస్తుంది. హక్కుల గురించి ప్రశ్నించడం తెలియదు…

ఉన్నత విద్యావంతురాలైన మహిళ.. చదువు కోసం, ఉద్యోగం కోసం కష్టపడుతుంది. అడుగడుగున వివక్షను ఎదుర్కొంటూ తన ఉన్నతికి తన కుటుంబం అభ్యున్నతికి తోడ్పడుతుంది..

పైన చెప్పిన మహిళలు ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితం కారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల పరిస్థితి ఇదే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకోలా లేదు. అక్కడా మహిళలకు సమాన అవకాశాలు లేవు. ఉద్యోగం కోసం అనేక పరీక్షలు ఎదుర్కోవాలి. పెళ్లప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఉద్యోగాలు మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాలి. లేదంటే అవమానాలు తప్పవు. ఇదే విషయాన్ని ఒక భర్త వివరించడం విశేషం.

అలెగ్జాండ్రా కొటోవా ఇద్దరు పిల్లల తల్లి. రెండో బిడ్డ పుట్టి ఎనిమిది నెలలు అయింది. పెళ్ళికి ముందునుంచీ ఆమె ఉద్యోగం చేసినా, పిల్లలు పుట్టినప్పుడు మానేయాల్సి వచ్చింది. భర్త వితలై కొటోవ్ మంచి ఉద్యోగంలోనే ఉన్నా అమెరికా వంటి దేశాల్లో ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే కుటుంబం సాఫీగా సాగుతుంది. దాంతో ఓ పక్క పిల్లలిద్దర్నీ చూసుకుంటూ, ఇంటి పని చూసుకుంటూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగావకాశాల కోసం అలెగ్జాండ్రా వెతుక్కుంటున్న దృశ్యాన్ని భర్త ఫోటో తీశాడు. కేవలం చిత్రం మాత్రమే కాదు, మహిళల కష్టాన్ని, తపనను కూడా వివరించాడు. మగవాడిగా తనకున్న  సౌకర్యాలనూ వివరించాడు.

ఎటువంటి కష్టం, ఇంటి గురించి ఆలోచించకుండా ఉద్యోగం చేసుకునే వీలు తనకుందని, అదే అన్ని అర్హతలూ ఉన్నా మహిళ కావడం వల్లఉద్యోగాల్లో  ఎదుర్కొనే ఇబ్బందులు, వివక్ష పట్ల ఆవేదన ఈ ఫోటో రైటప్ ద్వారా పంచుకున్నాడు.

లింగ సమానత్వం గురించి ఎంతగా మాట్లాడుతున్నా మనం ఇప్పటికీ మగవారి  కోసం, మగవారు సృష్టించిన ప్రపంచంలో బతుకుతున్నామని నిజాయితీగా ఒప్పుకొంటూ మహిళలను అభినందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. చిత్రం చూస్తే ఆ విషయం అర్థమవుతోంది కూడా.

-కె. శోభ

Also Read :

బిగ్ వీల్ గర్ల్ … యోగితా

RELATED ARTICLES

Most Popular

న్యూస్