ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ మూవీస్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రానుందని గతంలో వార్తలు వచ్చాయి. వార్తలు రావడమే కాదండోయ్ వీరిద్దరి కాంబినేషన్లో మూవీని చెన్నైలో భారీగా ప్రారంభించడం కూడా జరిగింది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. బన్నీ తన సినిమాలతో బిజీ అయితే.. లింగుస్వామి తన సినిమాలతో బిజీ అయ్యారు.
లింగుస్వామి ఎనర్జిటిక్ హీరో రామ్ తో ది వారియర్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో రూపొందిన ఈ భారీ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లింగుస్వామి బన్నీతో సినిమా చేయాలి అనుకున్నాను కానీ.. కుదరలేదు. అప్పట్లో ఆ ప్రాజెక్ట్ కుదరదు అని తెలిసింది అని చెప్పారు. లింగుస్వామి అలా చెప్పినప్పటి నుంచి అసలు ఏమైంది..? ఎందుకు బన్నీతో ప్రాజెక్ట్ సెట్ కాలేదు అని ఆరా తీస్తున్నారు సినీ జనాలు, మీడియా ప్రతినిధులు.
అయితే… ది వారియర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో లింగుస్వామికి బన్నీతో ప్రాజెక్ట్ గురించి ప్రశ్న ఎదురైంది. మరోసారి బన్నీతో ప్రాజెక్ట్ గురించి లింగుస్వామి మాట్లాడుతూ.. బన్నీతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాను. అతనితో చేయాల్సిన ప్రాజెక్ట్ అటకెక్కలేదని క్లారిటీ ఇచ్చారు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నారు. ఆతర్వాత బోయపాటితో మూవీ ఉంది. మరి.. ఆతర్వాత బన్నీ, లింగుస్వామి కాంబోలో మూవీ ఉంటుందేమో చూడాలి.