ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి పరారవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కొలంబోలో శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె నివాసంలోకి వెళ్లేందుకు గోడను ఎక్కిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనిక సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ప్రధానమంత్రి నివాసం చుట్టూ వైమానిక దళాలు పహారా కాస్తున్నాయి. ఇన్నాళ్ళు రాజపక్సే ను వెంటాడిన ఆందోళనకారులు ఇప్పుడు ప్రధానమంత్రి కూడా గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పేలా కనిపిస్తున్నాయి. శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా ఏమాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకు పరిస్థితులు తీవ్రతరమవతున్నాయి.
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో సహా మాల్దీవులకు పారిపోయారు. దీంతో లంకలో పెద్దపెట్టున నిరసనలు చెలరేగాయి. ఆందోళనకారులు అధ్యక్షభవనాన్ని చుట్టుముట్టారు. ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. వారిని అదుపుచేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశంలో మరోసారి పరిస్థితి అదుపుతప్పుతుండటంతో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
Also Read : మాల్దీవులు పారిపోయిన గోటబాయ రాజపక్స