శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికలో బాగంగా ఈ రోజు పార్లమెంటులో దేశ ఎనిమిదవ అధ్యక్షుడి ఎన్నిక కోసం వోటింగ్ జరగగా పార్లమెంటు సభ్యులు విక్రమసింఘె వైపే మొగ్గు చూపారు. పార్లమెంటులో జరిగిన వోటింగ్ లో మొత్తం 219 మంది వోటు హక్కు వినియోగించుకున్నారు. విక్రమసింఘెకు 134 వోట్లు రాగా ఆయన ప్రత్యర్థి అలహా ప్పెరుమాకు 82 వోట్లు, అనురాకుమారకు 3 వోట్లు పడ్డాయి.
అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె కంటే అధికార పార్టీ శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) బలపరిచిన దులస్ అలహాప్పెరుమా ముందున్నట్లు ప్రచారం జరిగింది. అధ్యక్షుడిగా అలహా ప్పెరుమాను, ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాసను ఎన్నుకోవాలని ఎస్‌ఎల్‌పీపీ మెజార్టీ సభ్యులు నిశ్చయించినట్లు పార్టీ అధ్యక్షుడు జీఎల్ పైరిస్ మంగళవారం ప్రకటించారు.
దేశాన్ని దివాలా తీయించిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడం వల్ల కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. కాబట్టి ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోనుండటం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో ఎస్‌ఎల్‌పీపీ బలం 101గా, ఎస్‌జేబీ బలం 50గా ఉంది.
Also Read : ఇండియాతో స్నేహం అత్యావశ్యకం – విక్రమసింఘె