ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ (AOB), తెలంగాణ, మహారాష్ట్రల్లో మావోయిస్టు అమరుల వారోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని సవాల్ చేసే విధంగా మావోలు వారోత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 28 నుండి ఆగస్ట్ 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలను పాటించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు చత్తీస్ ఘడ్ నుంచి కేంద్రకమిటీ లేఖ విడుదల చేసింది. భారత విప్లవకారులు, మహోపాధ్యాయులు మావోయిస్టు పార్టీ సంస్థాపక నాయకులు కామ్రేడ్ చారు ముజుందార్ 50వ వర్ధంతి కామ్రేడ్ కన్హాయ్ చటర్జీ 40వ వర్ధంతిలను…గొప్ప విప్లవ స్ఫూర్తితో విప్లవ సంకల్పంతో నిర్వహించాలని కేంద్ర కమిటీ కోరింది.
భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో శత్రువు వ్యూహాత్మక “సమదాన్ ప్రహర్ ” దాడిని ఓడించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ శ్రేణులను సమయాటం చేస్తోంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అన్ని కేడర్లవారు ఈ వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖలో పేర్కొంది. ములుగు జిల్లా వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరుతో మరో లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దమనకాండను ప్రతిఘటించాలని ప్రజలను కోరారు.