రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రకియలో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవయారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. 1672 మంది ఆన్ లైన్ టెండర్లు వేసి వారిలో కేవలం 1100 మంది మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారని, మిగతా వారిని బెదిరించారని ఆరోపించారు. మద్యం పాలసీలో ఇష్టానుసారం మార్పులు చేశారని, అధికార పార్టీ నేతలకు ఈ వ్యాపారం కట్టబెట్టేందుకు సరికొత్త నిబంధనలు పెట్టారని విమర్శించారు. రోడ్ల మరమ్మతులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎలా భయపడి పోతున్నారో అలాగే బార్ లైసెన్సులకు దరఖాస్తు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాకుండా చేశారన్నారు.
నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వేర్వేరు శ్లాబులు, వేర్వేరు రెట్లు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. బార్ లైసెన్సుల ద్వారా 72 కోట్ల ఆదాయం వస్తుందని, కానీ అడ్డదారుల్లో ఇంకా ఎక్కువ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మద్యం టెండర్లను వెంటనే ఉపసంహరించుకొని, పారదర్శకంగా జరిపించాలని డిమాండ్ చేశారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి అనుచరులకు టెండర్లు దక్కేలా మద్యం వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మద్యంపై ప్రతిరోజూ 240 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, ఈ ఆదాయం ఎక్కడకు పోతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా మద్యం పాలసీని సమీక్షించాలని సూచించారు.