కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది కాలం పాటు పొడిగించింది. రాజీవ్ గౌబా 2019లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 30 ఆగస్టు,2021తో ఆయన పదవీ కాలం ముగియనుండగా అప్పుడు ఒకసారి పొడగించారు.దీంతో రాజీవ్ గౌబా 30 ఆగస్టు,2022 వరకు పదవీలో కొనసాగారు. తాజాగా మరోసారి పదవీ కాలం పొడగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పొడిగింపుతో రాజీవ్ గౌబా 30 ఆగస్టు,2023 వరకు పదవీలో కొనసాగనున్నారు.
1982 జార్ఖండ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ గౌబా గతంలో హోం సెక్రటరీగా ఉన్నారు. కేంద్రంలో పట్టణ వ్యవహారాలు, హౌసింగ్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. జమ్ము కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు వ్యవహారంలో రాజీవ్ గౌబ కీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిన అనంతరం డీవోపీటీ గౌబా పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.