విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్ మెంట్ ను ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తూ, విద్యా సంస్థలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలో జమ చేస్తోన్న ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేయనున్నారు. ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను నేడు (11.08.2022, గురువారం) బాపట్లలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు
పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తోంది.
జగనన్న వసతి దీవెన: ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం. సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తోంది.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితులు లేవని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.