Thursday, September 19, 2024
HomeTrending Newsమేధావుల మౌనం దేశానికి మంచిది కాదు - కెసిఆర్

మేధావుల మౌనం దేశానికి మంచిది కాదు – కెసిఆర్

స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లయినా.. దేశం అనుకున్నంతగా పురోగమించలేదని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష శక్తులు కులం, మతం పేరుతో దేశ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పరోక్షంగా బిజెపి ని టార్గెట్ చేశారు.  దేశంలో జరుగుతున్న అరాచకాలు చూస్తూ మౌనం వహించడం కరెక్టు కాదని, మేధావి వర్గం అర్ధమైనా, అర్ధంకానట్లు వ్యవహరించడం సరికాదని కెసిఆర్ అన్నారు.
దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద, మానవ వనరులున్నయని, పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలన్నారు. గాంధీ గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడారని, గాంధీ గురించి ప్రపంచమే గొప్పగా చెబుతుంది. ఈ అల్పుల మాటలు ఎంత అన్నారు. తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కోటి మందికి పైగా ఒకేసారి పాల్గొని విజయవంతం చేశారన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల అపురూప ఘట్టాన్ని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉన్నదని కెసిఆర్ అన్నారు. పదిహేను రోజులపాటు తెలంగాణ నిర్వహించిన తీరు యావత్ దేశాన్ని ఆకర్షించిందని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.

స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సంఘసంస్కర్త  భాగ్యరెడ్డి వర్మ  వారసుడు, అంబేద్కరిస్టు అజయ్ గౌతమ్, కొమురం భీం వారసుడు కొమురం సోనేరావు, కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, వెయ్యి ఎకరాలకు పైగా భూములను దానం చేసిన భూదాన్ రాంచంద్రారెడ్డి తనయుడు అరవింద్ రెడ్డి, హరితహారంలో లక్షలాది మొక్కలు నాటిన వనజీవి రామయ్య, రావెల్ల వెంకట్రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మహ్మద్ హుసాముద్దీన్, సంగీత దర్శకులు శంకర్ మహదేవన్, కె.ఎం.రాధాకృష్ణ, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్, సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్ తదితరులను ఘనంగా సన్మానించారు.

75 ఏండ్ల స్వాతంత్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ… నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం” ముగింపు వేడుకలు హైదరాబాద్ ఎల్‌.బీ. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగింపు వేడుకల్లో శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు, వేలాదిగా ఆహుతులు హాజరయ్యారు.
వేడుకలు మొదట సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి ప్రదర్శించిన ‘‘వజ్రోత్సవ భారతి‘‘ నృత్య రూపకంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా “ఝాన్సీ లక్ష్మిబాయి” ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. వేలాదిమంది ఆహుతుల చప్పట్లతో ఎల్బీ స్టేడియం మారుమోగింది. అనంతరం.. గంగా జమున తెహజీబ్ కు ప్రతీకగా వార్షీ బ్రదర్స్ ఖవ్వాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘లెహరా రహాహై తిరంగా’’ అంటూ వారు జాతీయ జెండా ఔన్నత్యాన్ని చాటుతూ పాడిన ఖవ్వాలీ ఆహుతుల్లో జాతీయ స్ఫూర్తిని నింపింది. సారే జహాసే అచ్ఛా.. అంటూ వారు ఆలపించిన గీతం ప్రేక్షకులను గొంతు కలిపేలా చేసింది. ఆద్యంతం వారి ఖవ్వాలీ కార్యక్రమం ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులతో ఆస్వాదించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో ప్రారంభమైన శంకర్ మహదేవన్ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కార్యదీక్షా పరుడికి సంబంధించి లక్ష్య సిద్ధిని ప్రేరేపించే దేశభక్తి గీతాన్ని తెలంగాణ రాష్ట్ర సాధకుడైన సీఎం కేసీఆర్ కి అంకితం చేస్తున్నానని శంకర్ మహదేవన్ ప్రకటించారు. శంకర్ మహదేవన్ రాగయుక్తంగా ఆలపించిన పలు పాటలకు ప్రేక్షకులంతా లయాత్మకంగా స్పందించారు.

Also Read : వజ్రోత్సవాల ముగింపు వేడుకలు – ట్రాఫిక్ ఆంక్షలు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్