రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8 వ తేదీనుండి నిర్వహించిన “స్వతంత్ర భారత వజ్రోత్సవాల” ముగింపు వేడుకలు ఈ రోజు (సోమవారం) ఎల్.బి. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ సందర్బంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తెలంగాణ సమరయోధుల వారసులను, ఇటీవల పలు అంతర్జాతీయ పోటీలలో మెడల్స్ సాధించిన తెలంగాణకు చెందిన క్రీడాకారులను ఇతర ప్రముఖులను సన్మానిస్తారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో నిలిచిపోయే విధంగా దాదాపు మూడు గంటలపాటు అత్యంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఈ ముగింపు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సీ బ్రదర్స్ చే ఖవ్వాలి, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్బంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం లేజర్ షో తో పాటు భారీ ఎత్తున బాణసంచా ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగుస్తాయి. దాదాపు 30 వేలమంది ఈ ముగింపు ఉత్సవాలలో పాల్గొనే విధంగా రాష్ట్ర పాలనాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభకు సీఎం కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. చాపెల్‌ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్‌ రూమ్‌ మీదుగా అనుమతించనున్నారు. గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ వద్ద దారి మళ్లించి, చాపల్‌ రోడ్డు మీదుగా అనుమతించనున్నారు. రవీంద్రభారతి, హిల్‌ ఫోర్ట్‌ రోడ్డు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లించనున్నారు. బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం వద్ద కుడివైపునకు అనుమతించకుండా గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్‌రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్‌బాగ్‌ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద దారి మళ్లించి హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ మీదుగా అనుమతించనున్నారు. కింగ్‌కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్‌, భారతీయ విద్యాభవన్‌ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్‌ కోఠి ఎక్స్‌రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్‌మహల్‌, ఇడెన్‌ గార్డెన్‌ మీదుగా అనుమతిస్తారు. అలాగే బషీర్‌బాగ్‌ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ వద్ద దారి మళ్లించి లిబర్టీ మీదుగా అనుమతించనున్నారు. హిమాయత్‌నగర్‌ వై-జంక్షన్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ వై-జంక్షన్‌ వద్ద దారి మళ్లించనున్నారు.

Also Read : కమాండ్ కంట్రోల్ సెంటర్‌ దేశానికే మణిహారం : మంత్రి తలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *