జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన చివరి మ్యాచ్ లో 13 పరుగులతో విజయం సాధించింది. భారత ఆటగాడు శుభ్ మన్ గిల్ వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 49.3 ఓవర్లకు ఆలౌట్ అయ్యింది.
హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా 63 పరుగులకు తొలి వికెట్ (కెఎల్ రాహుల్-30) వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే మరో ఓపెనర్ ధావన్ (40) కూడా ఔటయ్యాడు. ఈ దశలో శుభ్ మన్ గిల్-ఇషాన్ కిషన్ లు మూడో వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 61 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ రనౌట్ గా వెనుదిరిగాడు. 97 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ తో 130 పరుగులు చేసిన గిల్ ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ అంతగా రాణించలేకపోయారు. ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత జింబాబ్వే ఏడు పరుగులకే తొలి వికెట్ (ఇన్నోసెంట్ కైయా-6) కోల్పోయింది. జట్టులో సికందర్ రాజా 95 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 115; సీన్ విలియమ్స్ 45 పరుగులు చేశారు. ఓ దశలో గెలుపు సాధ్యమనుకున్నప్పటికీ సరైన భాగస్వామ్యం లేకపోవడంతో ఓటమి తప్పలేదు.
ఇండియా బౌలర్లలో ఆవేష్ ఖాన్ మూడు; దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు; శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.
శుభ్ మన్ గిల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా లభించింది.
Also Read : India Vs Zimbabwe: ఇండియాదే వన్డే సిరీస్