వైఎస్సార్సీపీ మూడు రాజధానులకు, మూడు ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం, నిర్ణయం మేరకు 2024లోపే విశాఖకు పరిపాలనా రాజధాని తరలించే అవకాశాలున్నాయని సూత్రప్రాయంగా వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎన్నికైన తనకు అమరావతి ప్రాంతం అంటే ఎంత అభిమానమో, విశాఖ నగరం అన్నా, రాయలసీమ అన్నా అంతే ప్రేమ ఉందని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్య నిర్వాహక రాజధానిగా వైజాగ్, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని పునరుద్ఘాటించారు.
చంద్రబాబు, లోకేష్ ఉచ్చులో పడి మోసపోవద్దని అమరావతి ప్రజలకు, రైతులకు కొడాలి సూచించారు. ఈ దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై లాంటి రాజధానుల్లో కనీసం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, కానీ చంద్రబాబు తలపెట్టిన అమరావతి కేవలం ఒక నియోజక వర్గానికే పరిమితమైందని, కనీసం కార్పొరేషన్ కూడా కాదని అలాంటి ప్రాంతంలో అమరావతిని ప్రకటించి బాబు ప్రజలను మభ్య పెట్టారని నాని విమర్శించారు.
చంద్రబాబు సిఎం గా ఉండగా అయన ప్రభుత్వం కానీ, అప్పుడు కోర్టులు కానీ పాదయాత్రలకు అనుమతి మంజూరు చేయలేదని నాని గుర్తు చేశారు. ముద్రగడ పద్మనాభం నాడు పాదయాత్ర చేశామంటే అనుమతి నిరాకరించారని, కానీ నేడు అమరావతి పాదయాత్రకు అనుమతి ఇచ్చారని… దీన్ని బట్టి కోర్టుల్లో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఎంత బాగా వాదించారో అని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకున్న న్యాయ వ్యవస్థలో ఇంత పట్టు ఉండడం ప్రపంచంలో ఏడో వింతగా భావించ వచ్చాన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిఎం జగన్, అయన భార్య భారతమ్మపై చంద్రబాబు, అయన వేసే పెడిగ్రీ తింటున్న కొన్ని మీడియా సంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నాని తీవ్రంగా ధ్వజమెత్తారు.
Also Read : అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి