ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 35,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో సున్నితమైన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ప్రత్యేక ఏర్పాటు చేశామని, రేపు (శనివారం) ఉదయం వరకు వినాయక నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.

ఖైరతాబాద్‌ పంచముఖ మహాలక్ష్మీ మహాగణపతి శోభాయాత్ర.. వైభవంగా జరిగింది.  50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60 నుంచి 70 టన్నులకు చేరింది.

గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలికారు. ఉదయం 12 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి 7.45 కు హుస్సేన్ సాగర్ చేరుకోగా నగరం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తజనం.. జయ, జయ ధ్వానాల మధ్య.. బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు.

భాగ్యనగరంలో ఇవాళ నిమజ్జన వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. 354 కిలోమీటర్ల మేర శోభాయాత్రలో  భక్గతులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్‌ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేయగా.. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనులు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లతో గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు. 168 GHMC గణేశ్ యాక్షన్ టీమ్స్‌ రెడీ కాగా.. విధుల్లో 10 వేల మంది శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *