ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని చూస్తే మన దగ్గరా మూడో దశ(థర్డ్ వేవ్) ఉండే అవకాశం ఉందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. సెప్టెంబరులో అది వచ్చే అవకాశం ఉందన్నారు. వైరస్‌లో తీవ్రమైన ఉత్పరివర్తనాలు జరిగితే తప్ప ఇక్కడ దాని ప్రభావం తక్కువేనన్నారు. మూడో దశ పిల్లలపై తీవ్రత చూపుతుందనేదీ సరికాదన్నారు. తొలి రెండు దశల్లోనూ పిల్లలపై ఇన్‌పెక్షన్ ప్రభావం చూపిందన్నారు. ఇప్పటికే చాలామంది పిల్లల్లో ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) వృద్ధి చెందాయన్నారు.
వేగవంతమైన టీకాల పంపిణీతో పాటు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థర్డ్‌వేవ్‌ను అడ్డుకోవచ్చని సూచించారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పరిశ్రమల సమాఖ్య(ఎఫ్‌టీసీసీఐ)నిర్వహించిన వెబినార్‌లో ‘అందరికీ ఆరోగ్యం’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. రెండో విడతలో కేసుల తీవ్రతకు డెల్టా వైరస్ కారణమన్నారు. చైనా వైరస్ ఒకరి నుంచి ఇద్దరికి వ్యాపిస్తే అదే బ్రిటిష్ వైరస్ ముగ్గురికి, ఆల్ఫా నలుగురైదుగురికి, డెల్టా వైరస్ ఒకరి నుంచి ఏకంగా 5-8 మందికి సోకిందన్నారు. ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చినా మిగతా వారంతా కొవిడ్ బారిన పడటానికి ఇదే కారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం డెల్టా ప్లస్ కేసులు దేశవ్యాప్తంగా 100 లోపే నమోదయ్యాయన్నారు. తెలంగాణలో ఇంతవరకు ఒక్క కేసూ వెలుగుచూడలేదని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఏడాది తర్వాత కరోనా సాధారణ జలుబు, దగ్గు, జ్వరంలా మారిపోతుందని ఆయన వివరించారు.
త్వరలో స్వల్ప ధరకే దేశీయ ఔషధం
త్వరలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ దేశీయ తయారీ ఔషధం అందుబాటులోకి రానుందని డాక్టర్ నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. ల్యాబ్‌లో తయారుచేసిన ఈ మందు కరోనాపై గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు. వైరస్ సోకిన తొలి వారంలో దీన్ని అందించడం ద్వారా 2-3 రోజుల్లోనే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని ఆయన తెలిపారు. అమెరికా పూర్వ అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇదే ఔషధం ఇచ్చారని గుర్తుచేశారు. మన వద్దా పలువురు రోగులకు విజయవంతంగా దాన్ని అందించామని ఆయన చెప్పారు. ఈ చికిత్సకు ప్రస్తుతం రూ.70వేల వరకు ఖర్చవుతోందని, త్వరలో దేశీయ మోనోక్లోనల్ యాంటీబాడీస్ మందు రూ.10-15వేలకే అందుబాటులోకి రానుందని తెలిపారు. కరోనా రోగులందరికీ కాకుండా 10-20 శాతం మందికే అవసరమవుతుందన్నారు.
ఎస్1/ఎస్2 పరీక్షే ప్రామాణికం
చాలామంది రకరకాల పరీక్షలు చేయించుకొని యాంటీబాడీలు పెరగలేదంటూ ఆందోళన చెందుతున్నారని డాక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పారు. ఎస్1/ఎస్2 పరీక్ష మాత్రమే దీనికి ప్రామాణికమన్నారు. అందులో ప్రతిరక్షకాలు 100 కంటే ఎక్కువ ఉండాలని చెప్పారు. 40-50 మాత్రమే ఉంటే మూడో డోసు తీసుకోవాలని సూచించారు. తక్కువ యాంటీబాడీలు ఉంటే మరోసారి ఇన్‌పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. పిల్లలకు సెప్టెంబరులోపు 2-3 టీకాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వెబినార్‌లో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఐ.రమాకాంత్, కె.భాస్కరరెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.