Sunday, June 14, 2026
HomeTrending Newsటీకా తీసుకుంటే వైరల్‌ లోడు తక్కువే

టీకా తీసుకుంటే వైరల్‌ లోడు తక్కువే

టీకా పొందాక కూడా కొవిడ్‌-19 బారినపడినవారిలో వైరల్‌ లోడు చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో ఇస్తున్న రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని నిర్ధారించారు. ప్రస్తుతం కరోనాకు మంచి టీకాలు వచ్చాయి. ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవడంలో అవి సమర్థంగానే పనిచేస్తున్నాయి. అయితే ఏ టీకాకూ వంద శాతం సమర్థత ఉండదు. వ్యాక్సిన్‌ పొందాక కూడా ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు.

టీకా వల్ల దాదాపు 90 శాతం మేర కొవిడ్‌కు అడ్డుకట్ట పడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌ బారినపడినా.. అతడిలో వైరస్‌ తక్కువగానే ఉంటుంది. వ్యాధి తీవ్రత కూడా ఒక మోస్తరుగానే ఉంటుందని ఆరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకుడు జెఫ్‌ బర్జెస్‌ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 14 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 10 వరకూ అమెరికాలో 3,975 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందిన ఐదుగురికి, పాక్షికంగా టీకా పొందిన 11 మందికి, వ్యాక్సిన్‌ పొందని 156 మందికి కొవిడ్‌ సోకింది.

టీకా పొందని వారితో పోలిస్తే.. పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందినవారిలో వైరల్‌ లోడు 40 శాతం తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారిలో కొవిడ్‌తోపాటు జ్వరం వచ్చే అవకాశం 58 శాతం తక్కువని తేలింది. రెండు డోసులు పొందినవారికి కరోనా నుంచి 91 శాతం, ఒకే డోసుతో 81 శాతం మేర రక్షణ లభిస్తున్నట్లు తేల్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular