దేశంలో అన్ని రాష్ట్రాల్లో హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీషు మీడియానికే ఆదరణ పెరుగుతోంది. మొత్తం దేశమంతా బడులకు వెళ్లే పిల్లల్లో 26 శాతం మంది ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నట్లు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సర్వే చెబుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువ ఉంది. తెలంగాణాలో 74 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 63 శాతం బడి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు.
హిందీ రాష్ట్రాల్లో దాదాపు 58 శాతం మంది ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు. కొన్ని మారు మూల ప్రాంతాల్లో బోధన ప్రాంతీయ భాషల్లో జరుగుతున్నా పరీక్షలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో రాస్తున్నట్లు ఈ సర్వే గుర్తించింది. దేశమంతా ప్రభుత్వ, ప్రయివేటు బడుల్లో ఇరవై ఆరున్నర కోట్ల మంది పిల్లలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. ఇంగ్లీషు మీడియం వందకు వంద శాతం జమ్మూ కాశ్మీర్ లో ఉండగా, రెండో స్థానంలో తెలంగాణ, మూడులో కేరళ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 శాతం మంది బడి పిల్లలు బెంగాలీ మీడియంలోనే చదువుతుండడం విశేషం.