ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పట్టు బిగిస్తోంది. ఓ వైపు అమెరికా బలగాల ఉపసంహరణ వేగంగా జరుగుతుంటే తాలిబాన్ ఉగ్రవాదులు ఆధిపత్యం పెంచుకునే పనిలో ఉన్నారు. మళ్ళీ మత పెద్దలతో ఫత్వాలు, ఫర్మానాలు జారీ చేస్తున్నారు. తాజాగా పౌర సమాజంపై ఆంక్షలు విధిస్తున్నారు. మగవారి తోడు లేకుండా మహిళలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రావద్దని, ఇస్లాం ప్రకారం పురుషులు గడ్డం పెంచాలని హుకుం జారీ చేశారు.
తఖర్ ప్రావిన్స్ లో తాలిబాన్ ఆదేశాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాలిబాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యాలయాలు, ఆస్పత్రుల్ని కూల్చి వేస్తున్నారు. ప్రభుత్వ భవనాల్ని నేలమట్టం చేస్తున్నారు. లూటీలు, దోపిడీలు నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. తాలిబాన్ ఆగడాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వారం రోజుల పాటు సైనిక బలగాలతో తలపడిన ఉగ్రవాదులు కపిస ప్రావిన్సు లోని తగబ్ జిల్లాను కైవసం చేసుకున్నారు.
ఆఫ్ఘన్ బలగాలు టార్గెట్ గా ఇన్నాళ్ళు దాడి చేసిన ఉగ్ర మూకలు ఇపుడు పౌరసమాజంపై కొరడా ఝులిపిస్తున్నాయి. తాలిబాన్ లు మొదటి నుంచి ఇస్లాం సంప్రదాయాల అమలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా అమెరికా దాడులు మొదలైన నాటి నుంచి కొంత సంయమనం పాటిస్తున్నారు.