ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. సెక్యూరిటీ కౌన్సిల్ లో మార్పులు తీసుకురాకపోతే ప్రపంచంలోని వర్ధమాన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. భారత విదేశాంగ మంత్రి వ్యాఖ్యలకు అమెరికాతో సహా ప్రపంచ దేశాలు మద్దతు తెలిపాయి.
భద్రతమండలిలో సంస్కరణలు తీసుకురావటం అంత సులువు కాదని భారత విదేశాంగ మంత్రి వాషింగ్టన్ డిసి లో అన్నారు. భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు ఇచ్చినా… మండలి సంస్కరణలు జటిలమైన పని అన్నారు. అయితే ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి తెగేసి చెప్పారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ప్రపంచ దేశాలు భద్రతా మండలిలో సంస్కరణలకు మద్దతు ప్రకటించాయి. భారత్, బ్రెజిల్ తో పాటు ఆఫ్రికా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని వివిధ దేశాలు డిమాండ్ చేశాయి.
అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ తో సమావేశమైన జై శంకర్ రెండు దేశాల పరస్పర సహకారంపై చర్చించారు. ఇటీవల భారత పౌరులకు వీసాలో ఆలస్యం పై సమావేశంలో చర్చ జర్గినట్టు సమాచారం. వీసా సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు.
భద్రతామండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశ హోదా ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. భద్రతామండలిలో వీటో అధికారం కలిగిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు ఇప్పటికే భారత్ కు మద్దతు ప్రకటించాయి. కేవలం చైనా నుంచి మద్దతు లభించలేదు. చైనా తటస్థంగా వ్యవహరిస్తోంది.