ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి దారితీసింది. సరదాను పంచాల్సిన మ్యాచ్ ఒక్క సారిగా యుద్ధవాతావరణాన్ని తలపించింది. వినోదం కోసం జరిగిన మ్యాచ్‌లో బీభత్సం, హింసాకాండ చోటు చేసుకుంది. ఏకంగా 127 మంది ఫ్యాన్స్ చావుకు కారణమైంది. అరెమా – పెర్సెబయా మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా వివాదం జరగడంతో ఇరు జట్ల అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లారు.
వారిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఒక్కసారిగా అభిమానులు పరుగులు తీయడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. మరోవైపు టియర్ గ్యాస్ కారణంగా గాలిలో ఆక్సిజన్ అందక ఏకంగా 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 180 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.