అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి ఒక కోటి రూపాయల సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటాయించారు. అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను బి.ఆర్.అంబేద్కర్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హనీ తల్లిదండ్రులకు అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతనుకూడా ప్రభుత్వం తీసుకుంటుందని, నెలకు పది వేల రూపాయల పెన్షన్కూడా మంజూరుచేస్తున్నట్టు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామే రానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతులకు చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి బాలిక హనీ కి గాకర్స్ వ్యాధి పుట్టుకతోనే వచ్చింది. ఈ వ్యాధివల్ల కాలేయం పనిచేయదు. ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో సీఎం పర్యటించారు. తిరుగు ప్రయాణంలో సీఎం ఉండగా, హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును సీఎం చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు . తన వెంట హెలిపాడ్ వద్దకు తీసుకురావాలని అక్కడున్న భద్రతా సిబ్బందిని ఆదేశించారు. హెలిపాడ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం క్షుణ్నంగా మాట్లాడి హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని హిమాన్షు శుక్లాను సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆదేశించారు. కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరుచేసింది. హనీ వైద్యంకోసం కోటి రూపాయలు మంజూరుచేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్ వెల్లడించారు.
ఆదివారంనాడు అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు చిన్నారి హనీకి ఇంజక్షన్లను కలెక్టర్ పంపిణీచేశారు. ఈ గాకర్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసిందని, ప్రస్తుతం 13 ఇంజక్షన్లను నేడు అందించామన్నారు ఈ ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 కాగా, కంపెనీతోబ మాట్లాడి కోటి రూపాయలకు తెప్పించామని వెల్లడించారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన తెలిపారు.
పాప తండ్రి కొప్పాడ రాంబాబు మాట్లాడుతూ సిఎం ఎంతో ఉదారంగా స్పందించి ప్రభుత్వపరంగా ఆదుకుంటానని భరోసా కల్పించా రని, హామీ ఇచ్చిన రెండునెలల్లో వైద్య సేవలు ఆరంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.