లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో నేర సంస్కృతి హద్దులు దాటుతోంది. బుధవారం నైరుతి మెక్సికోలోని గురెరెరోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపన్ సిటీ హాల్‌లో ఆయుధాలతో వచ్చిన ఓ దుండగుల బృందం జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నగర మేయర్ కూడా ఉన్నారు. సాన్ మిగ్యుల్ టోటోలాపాన్ సిటీ హాల్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. తరువాత స్థానికంగా ఉన్న ఓ నివాసంపై కాల్పులు జరిపింది. అయితే ఘటనా స్థలం నుంచి బయటకు వచ్చిన ఫొటోల్లో బయటి గోడలలో అనేక బుల్లెట్ రంధ్రాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయని BNO న్యూస్ నివేదించింది.
ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సమీపంలోని ఒక ఇంటికి వెళ్లారు, అక్కడ తుపాకీ కాల్పుల వల్ల చాలా మంది చనిపోయారని నిర్ధారించారు. ఆ బిల్డింగ్ ముందు దాదాపు పది మంది బాధితులు గుంపులు గుంపులుగా ఉన్నారు. వారి శరీరాలపై రక్త స్రావం జరుగుతోంది. ఈ దృశ్యాలను రికార్డ్ చేసి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉన్న ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. సిటీ హాల్ రక్తంతో ఎర్రబారింది. దాడి జర్గుతున్న సమయంలో పోలీసులు బలగాలు ఘటన స్థలానికి చేరకుండా జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో కాల్పుల ఘటన తర్వాత ముష్కరులు తప్పించుకోగలిగారు. దాడి అనంతరం పోలీసులు ఎదురుకాల్పులు జరిపినా వారు తప్పించుకున్నారు. కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియానే ఈ దారుణానికి ఒడి గట్టిందని పోలీసులు అనుమానిస్తున్నారు.