పశ్చిమ బెంగాల్లో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ సోమవారం తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన తాను తృణమూల్ కాంగ్రెస్ లో చేరానని వ్యాఖ్యానించారు. కోల్ కతా లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నేతలు సుదీప్ బందోపాధ్యాయ. పార్థా ఛటర్జీ సమక్షంలో అయన పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ లో ఓ సాధారణ కార్యకర్తగా, సైనికుడిలా పనిచేస్తానని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ కొంత కాలంగా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని అందుకోసమే పార్టీని మారాల్సి వచ్చిందని చెపారు. మతతత్వ బిజెపిని పశ్చిమ బెంగాల్లో ప్రవేశించకుండా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నిలువరించారని అభిజిత్ కొనియాడారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం తలెత్తిన మత విద్వేషాలను అణచివేయడంలో మమతా బెనర్జీ కృషిని అయన ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఇతర రాజకీయ పక్షాల సహకారంతో బిజెపికి వ్యతిరేకంగా…జాతీయ స్థాయిలో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అభిజిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడంతో ఖాళీ అయిన జాంగీపూర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో 2012 లో తొలిసారి అభిజిత్ ముఖర్జీ లోక్ సభకు ఎన్నికయ్యారు, 2014లో మరోసారి అదే స్థానం నుంచి తిరిగి ఎన్నికయ్యారు, 2019లో ఓటమి పాలయ్యారు.