కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని, ఇపుడేమో… నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ మండిపడ్డారు. టిడిపి నేతల దృష్టి మొత్తం ప్రపంచంలో ఎక్కడ వికృత చేష్టలు చోటు చేసుకుంటున్నాయో… ఎక్కడెక్కడ అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయో అక్కడే ఉంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సానుకూల దృక్పథం (పాజిటివ్ అప్రోచ్) అనేది వారి పదకోశం (డిక్షనరీ)లోనే ఉన్నట్లుగా లేదని. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పనిలో నిరంతరం నిమగ్నమై ఉన్న తమపై రాళ్లేయడమే ఈ బ్యాచ్ పనిగా కనుపిస్తోందని బుగ్గన విమర్శించారు.
ఏఏ దేశాల్లో పరిస్థితులు బాగ లేవో వెతికి పట్టుకుని మరీ… అలాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వస్తాయని, ప్రజలు నానా అగచాట్లు పడాలని టీడీపీ నేతలు నిరంతరం కోరుకుంటున్నట్లుగా ఉందన్నారు బుగ్గన. అందుకే నోటికొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తూనే… మరో వైపు అభివృద్ధి వైపు తాము దృష్టి సారిస్తున్నమని ఆర్ధిక మంత్రి వివరించారు.
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై దుమ్మెత్తి పోయడం చూస్తే… పిల్లి శాపాలు … అనే సామెత గుర్తుకు వస్తోందని… ‘పిల్లి శాపాలకు ఉట్లు తెగవు’ అనేది యనమల మాటలకు అక్షరాలా సరిపోతుందని దుయ్యబట్టారు. రాష్ట్రమంతటా రైతాంగం పచ్చగా ఉంటే యనమల ఓర్వ లేక పోతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అంది వారి అవసరాలు తీరుతుంటే అది చూసి ఓర్వ లేక యనమల, ఇతర టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంతో పాటు ఈ ప్రభుత్వ హయంలో చేసిన అప్పులు, వివిధ పథకాలపై వెచ్చించిన నిధుల వివరాలతో ఓ సుదీర్ఘ ప్రకటన బుగ్గన విడుదల చేశారు.
Also Read : రాష్ట్ర ప్రగతిపై విపక్షాల అసత్య ప్రచారం : బుగ్గన