బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన హరిబాబు జై ఆంధ్రా ఉద్యమంతో గుర్తింపు సాధించారు. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటును డిమాండ్ చేస్తూ సాగిన జై ఆంధ్రా ఉద్యమంలో తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న, ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లతో కలిసి నాడు పాల్గొన్నారు.
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి సంఘం కార్యదర్శిగా పనిచేసిన హరిబాబు, లోక్ నాయక జయప్రకాశ్ నారాయణ నడిపించిన లోక్ సంఘర్ష్ సమితి ఉద్యమంలో కూడా చురుగ్గా పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో బిటెక్ పూర్తి చేసిన హరిబాబు, అదే యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. కూడా పూర్తి చేశారు. కొంత కాలంపాటు ఆంధ్రా యూనివర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా కూడా హరిబాబు పనిచేశారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు వీలుగా 1993 లో తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
1999 లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా విశాఖపట్నం-1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 2014లో విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి అయన సమీప ప్రత్యర్థి వైఎస్ విజయమ్మ పై 90 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అయన ఎమ్మెల్యేగా, ఎంపిగా విజయం సాధించిన రెండుసార్లు బిజెపి –తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం గమనార్హం. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ప్రధాన కారదర్శిగా, అధ్యక్షుడిగా కూడా హరిబాబు పనిచేశారు.