Most Expensive Ravi Varma Painting Saree :
ఇప్పుడు నడుస్తోంది పెళ్లిళ్ల సీజన్. పెళ్లనగానే పట్టు చీరలు గుర్తొస్తాయి. అదొక అవినాభావ సంబంధం. ఎవరికయినా పెళ్లి పట్టుచీరంటూ ఒకటి ఉండి తీరుతుంది. అసలు ప్రపంచంలోనే విలువైన పట్టుచీర గురించి విన్నారా?కన్నారా? తెలిసినా మళ్ళీ ఓ లుక్కేయండి
రవివర్మ చిత్రాలకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పెయింటింగ్ ఒక్కటి ఉన్నా అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది 12 రవివర్మ అపురూప చిత్రాలను ఒక చీరపై ఆవిష్కరించడం నిజంగా గొప్ప విషయమే. అందుకే ఈ పట్టుచీర గిన్నెస్ బుక్ ఎక్కిన అత్యంత ఖరీదైన చీరగా వార్తలో నిలిచి ఉంది. ఎవరికోసం? మొదటగా ఈ చీరని పెళ్లి కోసం కాకుండా పదో వివాహ వార్షికోత్సవానికి భార్యకి కానుకగా ఇచ్చాడట ఒక బెంగుళూరు బిజినెస్ మాన్. అదీ 2007లో. ఆ తర్వాత ఒక కువైట్ వ్యాపారి నేయించాడట. అప్పట్లో 40 లక్షలున్న చీర ధర ఇప్పుడు 50 లక్షలు.
Most Expensive Saree :
ఇక చీరలో దాగిన చిత్రాల విషయానికొస్తే మొత్తం 12 చిత్రాలు. పదకొండు చిత్రాలు బోర్డర్ లో బారుతీరాయి. అసలైన ఆణిముత్యం కొంగున పరచుకుంది. ‘ లేడీ మ్యూజిషియన్స్’ గా ప్రసిద్ధి చెందిన ఈ చిత్రం భిన్న సంస్కృతుల సంగీత సమ్మేళనం.
ఎనిమిది కిలోల బరువున్న చీర నేయడానికి 36 మంది నేతన్నలు 12 నెలలపాటు శ్రమించారు. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు వజ్రాలు, కెంపులు, నీలం, పచ్చలు .. విరివిగా ఉపయోగించారు. అయితేనేం, సులభంగానే ధరించి భరించవచ్చని తయారీ దారులయిన చెన్నై సిల్క్స్ భరోసా. తాజ్ మహల్ తో ముంతాజ్ బేగం సంతోషించిందో లేదో గానీ ఈ పట్టుచీరతో భార్యామణులు మురిసి మెరిసిపోవడం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చీర ‘రవివర్మకే అందని అందం’
-కె. శోభ