టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కబ్జా చేయబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇవ్వబోతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలిచ్చే డబ్బులన్నీ పేదల రక్తం పీల్చి సంపాదించిన సొమ్మేనన్నారు. ఆ పైసలన్నీ కచ్చితంగా తీసుకోవాలని, ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేసి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లిలో రోడ్ షో ప్రారంభించారు. దారి పొడవునా బీజేపీకే ఓటేయాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
అందులోని ముఖ్యాంశాలు…
• తెలంగాణలో యుద్దం స్టార్ట్ అయ్యింది. రాక్షసులకు, రామ దండు మధ్య యుద్దం మొదలైంది. సిద్దిపేటలో ఆడోళ్ల పుస్తెల తాడును తెంపుకొచ్చిన టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడు మీద పడ్డది. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం..
• రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏమొచ్చిందని అన్నోళ్లంతా ఇయాళ ఈడనే ఉన్నరు. ఏకంగా 15 మంది మంత్రులు, 86 ఎమ్మెల్యేలంతా మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకొచ్చిండ్రు… అడిగిందల్లా ఇస్తమని ఆశ చూపుతున్నరు.
• మునుగోడులో ఇంటింటికీ తిరిగి ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎసోళ్లు సిద్ధమైండ్రు. అవన్నీ పేదోళ్ల రక్తం తాగి సంపాదించిన పైసలే. కేంద్ర నిధులన్నీ దారి మళ్లించిన సొమ్ము అది. పేదోళ్లు పైసలు పడేస్తే ఓట్లేస్తరని కేసీఆర్ అనుకుంటున్నడు. ఆ పైసలన్నీ పక్కా తీసుకోండి… ఓటు యాడ గుద్దాలో ఆడ గుద్ది టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలే…
• ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతలు సంపాదించిన డబ్బలు సరిపోనట్లున్నయ్… ఇప్పుడు టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు భూములమీద పడ్డయ్. ఊరూరూ తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నరు.. రేపు టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ భూములన్నీ కబ్జా చేయబోతున్నరు.
• హుజూరాబాద్, దుబ్బాకలో ఎన్నికలొచ్చినయ్ కాబట్టే అక్కడ అంతో ఇంతో అభివ్రుద్ధికి నిధులొచ్చినయ్.. మునుగోడులో కూడా అంతే… రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయంగనే … గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. కొత్త రోడ్లు మంజూరైతున్నయ్. గొర్లకు డబ్బులొస్తున్నయ్.
• ఇన్నాళ్లుగా దళితులకు మూడెకరాలు, , డబుల్ బెడ్రూం ఇండ్లు, పెన్షన్లు ఇయ్యాలని అడిగితే ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలే… ఎన్నికలు రాంగనే అన్నీ ఇస్తమని ఆశపెడుతున్నడు.
• ఇన్ని చేసినా ఉప ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందని సర్వేల రిపోర్టులు రాంగనే కేసీఆర్ కు భయం పట్టుకుని జ్వరం వచ్చింది. ఏం చేయాలో తెల్వక ఢిల్లీకే పరితమైండు.
• నేనొక్కటే కోరుతున్నా… ఇక్కడ యువతకు ఉద్యోగాల్లేవు. ఉద్యోగాలు రానోళ్లు, దళిత బంధు రానోళ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు రానోళ్లు, టీఆర్ఎస్ పాలనలో దగాపడ్డోళ్లంతా బీజేపీకి ఓటేయాలని కోరుతున్నా. పువ్వు గుర్తుకు ఓటేయండి.. కేసీఆర్ కు గుణ పాఠం చెప్పాలని కోరుతున్నా..
Also Read : మునుగోడు బరిలో ప్రజా గాయకుడు గద్దర్