బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడింది. సోమవారం సాయంత్రం తుపానుగా మారిన సిత్రాన్..బంగ్లాదేశ్ తీరం వైపునకు దూసుకొస్తోంది. తీరానికి వచ్చే లోపు ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టింకోనా ద్వీపం నుంచి సంద్విప్..బరిసాల్ మధ్య తుపాన్ పెను బీభత్సం సృష్టిస్తోంది. రాజధాని ఢాకాతో వివిధ ప్రాంతాల్లో సుమారు పదిమంది వరదల్లో చిక్కుకుని చనిపోయారు.
అయితే సిత్రాంగ్ సముద్రం లోపలి నుంచే బంగ్లాదేశ్ వైపు పయనిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ కు సిత్రాంగ్ గా పేరు పెట్టారు. సిత్రాంగ్ పేరును థాయ్‌లాండ్ దేశం సూచించింది. దీనిని సి..త్రాంగ్ గా పిలుస్తారు. సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం దాటే ముందు తీవ్రరూపం దాల్చొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సిత్రాంగ్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తర కోస్తా ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.
వాతావరణ శాఖ మాత్రం ఏపీపై సిత్రాంగ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చెబుతోంది. అయినా అధికారులు ముందస్తుగా గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాదకర హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.