పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వచ్చే వారం చైనాలో పర్యటించనున్నారు. ప్రధాని షాబాజ్ తో పాటు పాక్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో ఇతర ఉన్నతస్థాయి బృందం బీజింగ్ పయనం అవుతోంది. చైనా అధ్యక్షుడు లీ జిన్ పింగ్ తో షాబాజ్ సమావేశం అవుతారు. నవంబర్ ఒకటి, రెండో తేదిల్లో ఈ పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో china Pakistan Economic Corridor (CPEC)లో భాగంగా మరో మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. సీపెక్ లో భాగమైన హెల్త్, డిజిటల్ రంగాల కారిడార్లపై స్పష్టత రానుంది.
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఈ ఏడాది ఏప్రిల్ లో బాద్యతలు స్వీకరించిన తర్వాత షాబాజ్ షరీఫ్... చైనాలో పర్యటించటం ఇదే ప్రథమం. కమ్యునిస్ట్ పార్టీ అఫ్ చైనా అధ్యక్షుడుగా లి జిన్ పింగ్ మూడవ దఫా ఎన్నికయ్యాక… ఒక దేశ ప్రధానమంత్రి బీజింగ్ వెళ్ళటం… అదీ షాబాజ్ షరీఫ్ కావటం గమనార్హం. ఉజ్బెకిస్తాన్ లో ఇటీవల జరిగిన షాంగై కో ఆపరేషన్ సమావేశం సందర్భంగా మొదటి సారి లి జిన్ పింగ్ – షాబాజ్ షరీఫ్ ల సమావేశం జరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు పాక్ ప్రధానమంత్రి చైనా పర్యటన చేపట్టినట్టు ఆ దేశ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.
షాబాజ్ షరీఫ్ చైనా పర్యటనతో పాకిస్తాన్ కన్నా చైనాకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చైనా పౌరులపై పాకిస్తాన్ లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. పాకిస్తాన్ లోని చైనా ప్రాజెక్టుల వద్ద చైనా ఆర్మీతోనే భద్రతా ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ ఇటీవల పెరిగింది. ప్రధానంగా ఈ అంశం చర్చకు రానుంది.